సంప్రదాయబద్ధంగా జాతర తొలి చాటింపు | venkatagiri polaramma festival first announcement | Sakshi
Sakshi News home page

సంప్రదాయబద్ధంగా జాతర తొలి చాటింపు

Published Thu, Sep 8 2016 1:53 AM | Last Updated on Mon, Oct 1 2018 6:33 PM

venkatagiri polaramma festival first announcement

వెంకటగిరి: పట్టణంలో అత్యంత వైభవంగా లక్షలాది మంది భక్తజన సందోహం మధ్య ఏటా జరిగే గ్రామశక్తి పోలేరమ్మ జాతరను ఈ నెల 21, 22వ తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు సంప్రదాయబద్ధంగా తొలిచాటింపును బుధవారం అర్ధరాత్రి వేశారు. దేవస్థాన ఈఓ రామచంద్రరావు ఆధ్వర్యంలో చాటింపు కార్యక్రమం జరిగింది. తొలుత గాలిగంగలు దేవస్థానం వద్ద ప్రత్యేక పూజలు చేసిన నిర్వాహకులు తప్పెట్లు, మోతలు, కిలారింతలతో గ్రామంలో చాటు వేశారు. అనంతరం పోలేరమ్మ దేవస్థానం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఉత్సవ కమిటీకి కసరత్తు పూర్తి
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ దేవస్థాన ధర్మకర్తల మండలి శాశ్వత కమిటీ ఏర్పాటు కాలేదు. ఏటా ఉత్సవ కమిటీతోనే జాతరను నిర్వహిస్తారు. ఈ క్రమంలో ఈ ఏడాదీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సూచనల మేరకు దేవాదాయశాఖ అధికారులు తాత్కాలిక ఉత్సవ కమిటీ కసరత్తు పూర్తి చేసినట్లు తెలిసింది. నేడో..రేపో నియామక ఉత్తర్వులు వెలువడనున్నట్లు సమాచారం. కాగా జాతర నిర్వహణకు సంబంధించి నిర్వహించే శాంతి సంఘ సమావేశ తేదీని ప్రకటించాలని బుధవారం దేవస్థాన ఈఓ రామచంద్రరావు తహశీల్దార్‌ మైత్రేయను లేఖ ద్వారా కోరారు. గూడూరు ఆర్డీఓ వెంకటసుబ్బయ్య పర్యవేక్షణలో గ్రామస్తులతో కమిటీ సమావేశం త్వరలో జరగనుంది. 
జాతరలో కఠిన నిర్ణయాలు ఫలితాలిచ్చేనా..?
వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ జాతరలో ప్రధానంగా క్యూల ఏర్పాటులో ఏటా అధికార యంత్రాంగం విఫలమవుతోంది. పోలేరమ్మ దేవస్థానం వద్ద డ్యూటీలు నిర్వహించే ఇతర ప్రాంతాల అధికారులు తమ పరిచయస్తులను దర్శనానికి ఎదురుగా పంపుతున్నారనే విమర్శలు ఏటా వస్తూనే ఉన్నాయి. అధికార పార్టీ నాయకులు, ద్వితీయశ్రేణి నాయకులు వీఐపీ పాసుల పేరుతో దేవస్థాన క్యూలైన్ల వద్ద హల్‌చల్‌ చేస్తుండటం పరిపాటిగా మారింది. ఈ ఏడాది వీఐపీ పాసులను రద్దు చేయడమే కాకుండా రూ.500, రూ.100 ప్రత్యేక దర్శన టికెట్లను ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే పలుమార్లు తెలియజేశారు. ఈ ప్రయోగం ఫలితమిస్తుందో లేదో వేచి చూడాల్సిందే.
జాతరకు రాజాల అనుమతి
జిల్లాలో ప్రాముఖ్యత కలిగిన వెంకటగిరి పోలేరమ్మ జాతర నిర్వహణకు దేవస్థాన ఈఓ రామచంద్రరావు బుధవారం వెంకటగిరి రాజాల అనుమతి కోరారు. ఈ మేరకు రాజా కుటుంబీకుడు డాక్టర్‌ వీబీ సాయికృష్ణయాచేంద్ర జాతరలో క్రియాశీలకమైన పనిబాపళోళ్లకు తాంబూలాలను అందించి వేడుక నిర్వహణకు అనుమతిచ్చారు. ఈ సందర్భంగా సాయికృష్ణ యాచేంద్ర మాట్లాడారు. శతాబ్దాల సంప్రదాయాలను తప్పకుండా జాతరను నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేశారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాల్సిందిగా దేవాదాయ శాఖ ఈఓ రామచంద్రరావుకు సూచించారు. లాలాపేట సింగిల్‌ విండో అధ్యక్షుడు గొల్లగుంట వెంకటముని, దేవస్థాన మాజీ కమిటీ అధ్యక్షుడు పులి కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement