ఎన్నికల ప్రవర్తనా నియమావళి టీడీపీకి వర్తించదా?
– వైఎస్సార్‌సీపీ జడ్పీ ఫ్లొర్ లీడర్ వెన్నపూస రవీంద్రారెడ్డి
అనంతపురం రూరల్ : ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి టీడీపీ పార్టీకి వర్తించదా , నగరంలోని ప్రధాన వీధుల్లో ఏర్పాటు చేసిన టీడీపీ ఫ్లెక్సీలు అధికారులకు కనింపించడం లేదా, ఎన్నికల సంఘం టీడీపీ అభ్యర్థులకు ఏమైనా మినాయింపు ఇచ్చిందో అధికారులు సమాధానం చెప్పాలని వైఎస్సార్‌సీపీ జడ్పీ ఫ్లొర్ లీడర్ వెన్నపూస రవీంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం వైఎస్సార్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం జిల్లాలో ఎక్కడా రాజకీయ పార్టీలకు సంబంధించిన బ్యానర్లు, ఫ్లెక్సీలు, గోడ రాతలు ఎక్కడున్నా తొలగించాలని జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారన్నారు.
అయితే నగరంలో పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి చెందిన ఫ్లెక్సీలను మాత్రమే అధికారులు తొలగించి, పక్కనే ఉన్న టీడీపీ అభ్యర్థి ఫ్లెక్సీలను అలాగే ఉంచడమేమిటని ప్రశ్నించారు. అధికార పార్టీ నాయకులకు జిల్లా యంత్రాంగం తొత్తులుగా మారారని మండిపడ్డారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న చిత్రపటాలను కూడా వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. జిల్లా అధికారుల తీరుపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి గుణపాఠం చెప్పి ప్రజాస్వామ్యానికి ప్రాణం పోయాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు శ్రీనివాసులు, కమల్, జావేద్ తదితరులు పాల్గొన్నారు.