ఏలూరుపాడులో విజిలెన్స్ దాడులు
Published Fri, Oct 21 2016 2:13 AM | Last Updated on Mon, Sep 4 2017 5:48 PM
కాళ్ల : అక్రమంగా గ్యాస్ సిలిండర్లు నిల్వ ఉంచిన దుకాణంపై ఏలూరు రీజినల్ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గురువారం దాడులు చేశారు. ఏలూరుపాడులో సద్దిశెట్టి రాధాకృష్ణ ఆయిల్స్, తాళ్లు వ్యాపారం చేస్తుంటారు. ఆయన ఇంట్లో అక్రమంగా గ్యాస్ సిలిండర్లు విక్రయిస్తున్నారన్న సమాచారంతో విజిలెన్స్ ఎస్పీ వి.సురేష్‌బాబు ఆదేశాల మేరకు విజిలెన్స్ ఎస్సై కె.సీతారాం, అధికారులు తనిఖీలు చేశారు. సద్దిశెట్టి రాధాకృష్ణ ఏడాది నుంచి గ్రామంలోని ఓ ఏజెన్సీ నుంచి సిలిండర్లు తీసుకువచ్చి అధిక ధరకు విక్రయిస్తున్నట్టు గుర్తించారు. ఆయన ఇంట్లో మొత్తం 24 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని కాళ్ల ఆర్‌ఐ అడవి కృష్ణ కిశోర్‌కు అప్పగించారు. అనంతరం విజిలెన్స్ ఎస్సై సీతారాం మాట్లాడుతూ.. ఓ వ్యక్తి ఇంట్లో ఇన్ని సిలిండర్లు ఉండడం ఆశ్చర్యంగా ఉందని, గ్యాస్ ఏజెన్సీ నుంచి రాధాకృష్ణ సిలిండర్లు ఎలా తెస్తున్నారో విచారిస్తామని, ఏజెన్సీని కూడా తనిఖీ చేస్తామని వెల్లడించారు. తనిఖీల్లో విజిలెన్స్ తహసీల్దార్ పి.శైలజ, సిబ్బంది, వీఆర్వోలు రాజేంద్ర ప్రసాద్, సుబ్రహ్మణ్యం, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement