- నెలాఖరుకు ఔట్‌పేషెంట్ సేవలు
- మూన్నెళ్లలో శస్త్రచికిత్సలు అందుబాటులోకి
- వైద్యవిద్యా సంచాలకులు డా.కె.వెంకటేష్
హైదరాబాద్: విశాఖపట్నం జిల్లాతో పాటు విజయనగరం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లాలకు అత్యవసర వైద్యసేవల నిమిత్తం విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్స్ (విమ్స్)ను నెలరోజుల్లో అందుబాటులోకి తేనున్నట్టు వైద్య విద్యా సంచాలకులు డా.కాకొల్లు వెంకటేష్ అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే విమ్స్‌కు సంబంధించిన 150 ఎకరాల భూమిని డీఎంఈ పరిధిలోకి తీసుకున్నట్టు చెప్పారు.
నెలరోజుల్లో ఔట్‌పేషెంట్ సేవలు అందుబాటులోకి వస్తాయని, మూన్నెళ్లలో శస్త్రచికిత్సలు చేస్తామని, ఆరు మాసాల్లో ట్రామాకేర్‌సేవలతో పాటు అన్ని అత్యవసర సేవలూ అందుబాటులోకి తెస్తామని చెప్పారు. అన్ని సదుపాయాలు త్వరలో పూర్తవుతాయని పేర్కొన్నారు. పలు రకాల శస్త్రచికిత్సలకు సంబంధించిన రూ.30 కోట్ల విలువైన పరికరాలు కొనుగోలు బాధ్యతలు రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్‌ఐడీసీ)కి అప్పజెప్పామని, ఈ ప్రక్రియ త్వరలో పూర్తవుతుందన్నారు. విమ్స్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాక వైద్య సీట్లకూ దరఖాస్తు చేసే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా డీఎంఈ చెప్పారు.