విమ్స్‌లో వైద్య సేవలకు మంగళం!
ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయానికి అప్పగింత?
సూత్రప్రాయంగా నిర్ణయించిన ప్రభుత్వం
విమ్స్ ఇక అకడమిక్ సేవలకే పరిమితం
పేదలకు సూపర్ స్పెషాలిటీ సేవలు మృగ్యమే
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఉత్తరాంధ్రతోపాటు ఉభయ గోదావరి జిల్లాల పేద రోగులకు అత్యున్నత వైద్య సేవలు అందించడం కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పునాది రాయి వేసిన విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(విమ్స్)కు టీడీపీ ప్రభుత్వం సమాధి కడుతోంది. విమ్స్‌ను ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయానికి అప్పగించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ ప్రతిపాదనను సూత్రప్రాయంగా ఆమోదించారు. ఇది అమల్లోకి వస్తే పేద రోగులకు విమ్స్ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందకుండా పోతాయి.
విమ్స్ స్ఫూర్తి ఇదీ...
హైదరాబాద్‌లోని నిమ్స్ తరహాలో విశాఖపట్నం కేంద్రంగా ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, ఒడిశా, చత్తీస్‌గఢ్‌కు చెందిన రోగులకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి తేవాలనే సంకల్పంతో వైఎస్ రాజశేఖరరెడ్డి విమ్స్‌కు రూపకల్పన చేశారు. రూ.250 కోట్లతో 1,130 పడకలు, 21 సూపర్ స్పెషాలిటీ వైద్య విభాగాలతో ఈ ఆసుపత్రిని నిర్మించాలని నిర్ణయించారు. విశాఖలోని ఆరిలోవలో 250 ఎకరాలు కేటాయించి, 2007లో శంకుస్థాపన చేశారు. నిర్మాణ పనులకు తొలి విడతగా రూ. 35.18 కోట్లు కేటాయించారు.
వైఎస్ అనంతరం విమ్స్‌పై అశ్రద్ధ
వైఎస్ హఠాన్మరణం అనంతరం వచ్చిన ప్రభుత్వాలు విమ్స్ నిర్మాణంపై చిత్తశుద్ధి చూపించలేదు. రోశయ్య ప్రభుత్వం రూ.20 కోట్లే కేటాయించింది. కిరణ్‌మార్‌రెడ్డి ప్రభుత్వం విమ్స్‌ను 500 పడకలు, 17 సూపర్ స్పెషాలిటీ వైద్య విభాగాలుగా కుదించింది. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం 200 పడకలు, కేవలం 8 సూపర్ స్పెషాలిటీ విభాగాల స్థాయికి కుదించేసింది. విమ్స్‌ను ప్రైవేట్‌పరం చేయాలని తొలుత నిర్ణయించింది. విశాఖలో విద్యా సంస్థలను నిర్వహిస్తున్న అధికార పార్టీ సీనియర్ ప్రజాప్రతినిధికి అప్పగించాలని బావించింది. ప్రజావ్యతిరేకత వస్తుందన్న ఉద్దేశంతో తాత్కాలికంగా వెనక్కి తగ్గింది.
ఇక వైద్య విద్యా బోధనకే పరిమితం
విమ్స్‌ను ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయానికి అప్పగించాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. వైద్య విశ్వవిద్యాలయానికి అప్పగిస్తే విమ్స్‌ను కేవలం వైద్య విద్యా బోధనకే పరిమితం చేస్తారు. పేద రోగులకు వైద్య సేవలు అందించరు. సీఎం చంద్రబాబు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ శనివారం ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో దీనిపై చర్చించారు. సాంకేతిక అభ్యంతరాలను అధిగమించి ఈ ప్రతిపాదనను ఎలా అమలు చేయాలన్న దానిపై త్వరలో తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు.
లోగుట్టు ఏదైనా ఉందా!
విమ్స్‌ను ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి అప్పగించడం వెనుక లోగుట్టు వేరే ఉందేమోనన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. విశ్వవిద్యాలయాల నిధులను ఆస్పత్రుల అభివృద్ధికి వెచ్చించకూడదని భారత వైద్య మండలి(ఎంసీఐ) నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. వైద్య విశ్వవిద్యాలయానికి అప్పగించినా విమ్స్‌కు ప్రభుత్వమే నిధులు కేటాయించాలి. దానికంటే వైద్య సేవలకే ఉపయోగిస్తే పేదలకు ప్రయోజనం కలుగుతుంది. కానీ ప్రభుత్వం ఆ దిశగా యోచించడం లేదు. అంటే వైద్య విశ్వవిద్యాలయం ముసుగులో విమ్స్‌ను ప్రైవేట్‌పరం చేసే ఉద్దేశం ఉందా? అని నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
తుది నిర్ణయం తీసుకోలేదు
విమ్స్‌ను ఎలా ఉపయోగించుకోవాలన్న దానిపై ప్రభుత్వంతో చర్చించామని, ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వీసీ డాక్టర్ రవిరాజ్ చెప్పారు. విమ్స్‌ను ఆస్పత్రిగా నిర్వహించాలా? లేక వైద్య విద్యా బోధనకు కేటాయించాలా? అనే దానిపై ప్రభుత్వం ఆలోచిస్తోందని తెలిపారు.