విమ్స్ ‘వెన్ను విరిచేశారు’ !
సాక్షి, హైదరాబాద్: విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (విమ్స్)ను ప్రభుత్వం నీరుగార్చేసింది. వైద్య విద్యా శాఖ (డీఎంఈ) ఆస్పత్రుల ‘మంద’లో కలిపేసింది. అటానమస్ ఆస్పత్రుల జాబితా నుంచి తొలగించి డీఎంఈ పరిధిలోకి తెస్తూ గురువారం జీవో జారీ చేసింది. ఇకపై పనులు వేగవంతం చేస్తామని పేర్కొంది.
హైదరాబాద్‌లోని నిమ్స్ స్థాయిలో స్వతంత్ర ప్రతిపత్తి సంస్థగా అభివృద్ధి చేయడం ద్వారా సామాన్యులకు కూడా మెరుగైన వసతులు కల్పించే ఉద్దేశంతో 2007లో అప్పటి ప్రభుత్వం విమ్స్ నిర్మాణానికి పూనుకుంది. విశాఖపట్నం జిల్లా చిన్నగదిలి గ్రామంలో 102.24 ఎకరాల స్థలాన్ని దీనికోసం కేటాయించారు. 8 సూపర్ స్పెషాలిటీ విభాగాలు, దీనికి అనుబంధంగా జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, అనస్థీషియా వంటి మరో 7 అనుబంధ విభాగాలు, 4 ఇంటెన్సివ్ కేర్ విభాగాలు ఏర్పాటు చేయాలనేది నిర్ణయం.
తొలి దశలో రూ.103 కోట్ల వ్యయం అంచనా వేశారు. ఆ మేరకు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం తొలి విడతగా రూ.50 కోట్ల నిధులు మంజూరు చేసింది. కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు నిధులు సక్రమంగా మంజూరు చేయలేదు. అటానమస్ సంస్థ అయిన విమ్స్‌కు నిధులివ్వడంలో తీవ్ర అలసత్వం ప్రదర్శించాయి. దీంతో ఇప్పటికీ సివిల్, ఎలక్ట్రికల్ పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి.
తాజాగా చంద్రబాబు ప్రభుత్వం సంస్థ ఏర్పాటు లక్ష్యాన్ని నీరుగారుస్తూ దానిని కాస్తా డీఎంఈ పరిధిలో చేర్చేసింది. స్వతంత్ర ప్రతిపత్తి ఉంటే ఎయిమ్స్, నిమ్స్ తరహాలో తీర్చిదిద్దేందుకు, అత్యాధునిక సౌకర్యాల కల్పనకు అవకాశం లభించేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.