
పుష్కరాల ట్విట్టర్ ఖాతాలో ప్రముఖులు వీరే..
రాజమండ్రి : గోదావరి పుష్కరాల మెయిన్ మీడియా సెంటర్ ట్విట్టర్ ఖాతాలోకి చేరుకున్న ప్రముఖుల జాబితా బుధవారంనాటికి వందకు చేరింది. ట్విట్టర్‌లో గోదావరి నది, తీరప్రాంత జీవన వైవిధ్యం, రాజమండ్రి వద్ద గోదావరి ప్రభావం, 2003 గోదావరి పుష్కరాల ఆకర్షణీయమైన చిత్రాలకు ఇచ్చిన వ్యాఖ్యానాలు పలువురి దృష్టిని ఆకర్షించాయి. ట్విట్టర్‌లో జీపీఎంఎంసీ 2015, ఫేస్‌బుక్‌లో జీపీఎంఎంసీఆర్‌జెవై పేరుతో ఇవి అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఫేస్‌బుక్‌లో తెలుగు పోస్టుల కారణంగా ఎక్కువమంది తెలుగువారు చూస్తూ స్పందిస్తూండగా, ఆంగ్లంలో ఉండే ట్విట్టర్‌ను దేశ విదేశాలవారు ఫాలో అవుతున్నారు.
ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ట్విట్టర్ మొదలైన రోజే సభ్యునిగా చేరగా, దలైలామా, సుబ్రహ్మణ్యస్వామి, అరవింద్ కేజ్రీవాల్, రాజ్‌నాథ్‌సింగ్, అరుణ్ జైట్లీ, శివరాజ్‌సింగ్ చౌహాన్, నిర్మలా సీతారామన్, మక్తార్ అబ్బాస్ నక్వి, అమిత్‌షా, కిరణ్‌బేడీ, సచిన్ టెండూల్కర్, అజేయ్ మాకెన్, నేషనల్ జియోగ్రఫిక్ చానల్, ఎన్.రామ్ (ది హిందూ), జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్, ఆమిర్‌ఖాన్, నాగార్జున అక్కినేని, పవన్ కళ్యాన్, మహేష్‌బాబు, రామ్‌గోపాల్‌వర్మ, రాజమౌళి, ఏఆర్ రెహమాన్, శృతిహాసన్, దగ్గుబాటి రానా వంటివారు ఉన్నారు. అమితాబ్ బచ్చన్ వంటి పాపులర్ వ్యక్తులకు సుమారు 50 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నందున రాజమండ్రి పుష్కరాల గురించి వీరందరికీ సమాచారం అందుతుందని వీటిని నిర్వహిస్తున్న సమాచార శాఖ అధికారి జాన్సన్ చోరగుడి తెలిపారు. కాగా ఇప్పటివరకూ ఈ ఖాతాను 113 మందికి పైగా ఫేస్‌బుక్ ఖాతాలో అనుసరిస్తున్నారని, పుష్కరాలు ముగిసేలోగా ఈ సంఖ్య ఇంకా పెద్ద ఎత్తున పెరుగుతుందనే ఆశాభావంతో ఉన్నామని ఆయన అన్నారు.