ప్రభుత్వంపై వీఆర్‌పీఎస్ పోరు
– వీఆర్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. సుభాష్ చంద్రబోస్
కర్నూలు(అర్బన్): వాల్మీకులను ఎస్‌టీ జాబితాలో చేర్చాలనే ప్రధాన డిమాండ్‌పై ప్రభుత్వం వీర్‌పీఎస్ పోరాటం చేస్తోందని వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎం. సుభాష్ చంద్రబోస్ తెలిపారు. సోమవారం స్థానిక కార్యాలయంలో జరిగిన ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. వాల్మీకులను ఆరు నెలల వ్యవధిలో ఎస్‌టీ రిజర్వేషన్ వర్తింపజేస్తు చర్యలు తీసుకోవాలని, వాల్మీకి ఫెడరేషన్‌కు రూ.1000 కోట్లు నిధులు కేటాయించాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంకా కాలయాపన చేస్తూపోతే వాల్మీకులు చూస్తూ ఊరుకోరన్నారు. డిసెంబర్ 14వ తేది నుంచి 18 వరకు 99 గంటల పాటు శ్రీ కృష్ణ దేవరాయల సర్కిల్‌లో నిరవధిక నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాల్మీకులను సమీకరించి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకువస్తామన్నారు. సమావేశంలో వీఆర్‌పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడురు గిడ్డయ్య, జిల్లా నాయకులు లోకేష్, మల్లేష్, రంగన్న, మహేష్, శివన్న, వీరేష్, విద్యార్థి నాయకులు శివ, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
బోయ ఓబులేసుపై దాడి అమానుషం ...
అనంతపురం జిల్లా రాప్తాడులో బోయ ఓబులేసుపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని వీఆర్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్ చంద్రబోస్ తెలిపారు. పోలీసులు పక్కనే ఉన్నా, దాడిని నియంత్రించకపోవడం దారుణమన్నారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలన్నారు. ఈ ఘటనను ఖండిస్తూ అనంతపురం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తామన్నారు.