నిద్రలోనే పరలోకానికి..
ఇద్దరు చిన్నారులను బలిగొన్న గోడ
రామాయంపేట: ఓ గోడ ఇద్దరు చిన్నారులను పొట్టన పెట్టుకుంది. అప్పటివరకు అంతా ఉల్లాసంగా ఉన్నారు. కబుర్లు చెప్పుకున్నారు. భోజనం చేసి తమ పూరి గుడిసెలో నిద్రపోయారు. తెల్లారేసరికి గోడ కూలడంతో ఇద్దరు చిన్నారులు శాశ్వతంగా నిద్రలోకి జారుకున్నారు. ఈ ఘటనతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కళ్లెదుటే కన్న కూతుళ్లను కోల్పోయిన వారు అంతులేని ఆవేదనకు లోనయ్యారు. వారి రోదన తండా వాసులను సైతం కంటతడిపెట్టించింది. వివరాలు ఇలా...
రామాయంపేట మండలం నస్కల్ పరిధిలోని నగరం తండాకు చెందిన బానోత్ లాలూ, కంలీ దంపతులు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు. శనివారం రాత్రి కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేశారు. ఆ తరువాత తమ పూరిగుడిసెలో నిద్రపోయారు. ఆదివారం తెల్లవారు జామున అకస్మాత్తుగా గోడ కూలడంతో పెద్ద కూతురు మౌనిక (9), చిన్న కూతురు గీత(5) తీవ్రంగా గాయపడ్డారు. కంలితోపాటు కుమారుడు చందుపై పెళ్లలు పడడంతో స్వల్పంగా గాయపడ్డారు.
తీవ్రఆందోళకు గురైన లాలూ వెంటనే తండాలోని ఆటో డ్రైవర్‌ను లేపి ఇద్దరు పిల్లల ను చికిత్స నిమిత్తం రామాయంపేట ఆసుపత్రికి తరలిం చాడు. అప్పటికే మౌనిక(చిట్టి), గీత మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. అదే ఆటోలో మృత దేహాలను తం డాకు తరలించారు. విషయం తెలుసుకొన్న గిరిజనులు, పరిసర గ్రామాల ప్రజలు తండాకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీనితో తండాలో విషాదం నెలకొంది. కన్నీరు మున్నీరైన ఆ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరితరం కాలేదు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆ గుడిసె గోడ పూర్తిగా తడవడం వల్లే కూలినట్టు తెలిసింది.
ఉన్న ఇద్దరు కూతుళ్లను కోల్పోయి..
భానోత్ లాలూ, కంలి దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఓ కొడుకు. కాగా ఈ ఘటనలో ఇద్దరు కూతుళ్లను పోగొట్టుకున్నారు. పెద్ద కూతురు చిట్టి అలియాస్(9) నాలుగో తరగతి చదువుతుంది. రెండో కూతురు గీత(5) అంగన్‌వాడీ కేంద్రంలో చదువుతుంది. కుమారుడు చందు అందరికంటే చిన్నవాడు. స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం: పద్మ
నగరం తండాలో జరిగిన ఘటనను తెలుసుకున్న డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆదివారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ ఈ ఘటన దురదృష్టకరమన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. స్థానిక ఎంపీపీ పుట్టి విజయల క్ష్మి, జెడ్పీటీసీ బిజ్జ విజయలక్ష్మి తదితరులు ఆసుపత్రి వద్ద బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. రూ.5వేల నగదు ఆర్థిక సాయాన్ని అందజేశారు. వారి వెంట పుట్టి యాదగిరి, బిజ్జ సంపత్, అందె, బాజ చంద్రం, మన్నె జలంధర్, టీఆర్‌ఎస్ నందిగామ అధ్యక్షుడు బుచ్చ నర్సింలు, కన్న అంజాగౌడ్ తదితరులు ఉన్నారు.