తమ కాలనీలో మద్యం దుకాణం వద్దంటూ కర్నూలులోని ఎక్సైజ్ కార్యాలయాన్ని ముట్టడించిన గోనెగండ్ల పట్టణ ముస్లింలు
మద్యంపై యుద్ధం
Published Tue, Jul 4 2017 12:02 AM | Last Updated on Tue, Sep 5 2017 3:06 PM
- జనావాసాల్లో మద్యం దుకాణాల ఏర్పాటు
- తీవ్రంగా వ్యతిరేకిస్తున్న స్థానికులు
- వద్దే..వద్దంటూ ఆందోళనలు
- వందకు పైగా దుకాణాలకు నిరసన సెగ
- క్రమంగా విస్తరిస్తున్న ఉద్యమం
మద్యంపై యుద్ధం మొదలైంది. ప్రజల్లో వచ్చిన చైతన్యం.. నిరసన జ్వాలను రగిలింపజేస్తోంది. జీవితాలను నాశనం చేసే మద్యం దుకాణాలు తమ ప్రాంతంలో వద్దే వద్దంటూ ఆందోళనలు చేస్తున్నారు. పట్టణాలు, నగరాల్లో మొదలైన ఈ ఉద్యమం..క్రమంగా పల్లెలకూ పాకింది. మహిళా, యువజన, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఉద్యమిస్తుండడంతో చాలా చోట్ల దుకాణాలను తెరవలేని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన మద్యం విధానం ఈ నెల ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది. జిల్లాలో 204 మద్యం దుకాణాలు, 45 బార్లు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటిదాకా 59 మంది వ్యాపారులకు మాత్రమే ఎక్సైజ్ అధికారులు లైసెన్సులు అందించారు. జిల్లాలో సగం దుకాణాలకు నేటికీ స్థలాలు ఖరారు కాలేదు. వేలంలో దక్కించుకున్న వ్యాపారులు.. దుకాణాలను తెరవడానికి జంకుతున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో జాతీయ రహదారులకు 500 మీటర్ల దూరంలో దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలి. ఈ నిబంధన కారణంగా అనువైన స్థలాల కోసం జల్లెడ పట్టాల్సి వస్తోంది.
మసీదు దగ్గర మద్యం దుకాణం వద్దు
కర్నూలు (న్యూసిటీ): గోనెగండ్లలోని అచ్చుకట్ల వీధిలో మద్యం దుకాణం ఏర్పాటు చేయవద్దని ఆవాజ్ కమిటీ జిల్లా నాయకుడు సుభాన్ డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట గోనెగండ్ల గ్రామానికి చెందిన ముస్లింలు భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బార్‌లు, బెల్టు దుకాణాలను పెట్టి ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారన్నారు. అనంతరం ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఇందుకు ఎక్సైజ్ శాఖ డీసీ స్పందిస్తూ.. గోనెగండ్ల గ్రామంలో మద్యం దుకాణాన్ని పెట్టనీయమని హామీ ఇచ్చారు. ధర్నాలో ఆవాజ్ కమిటీ రాష్ట్ర నాయకులు ఇక్బాల్ హుసేన్, ఎన్‌ఎండీ షరీఫ్, ఇస్మాయిల్, ఖలీల్, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి.నిర్మలమ్మ, హసన్‌బాసా, మక్బుల్‌సాహెబ్, కమల్ బాసా, దాదావలి, మన్‌సూరీ, ఫకృద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement