ట్రాఫిక్ పోలీసుల తీరుపై నిరసన
ఒంగోలు క్రైం : ఒంగోలు చర్చి సెంటర్లో ట్రాఫిక్ పోలీసుల తీరుపై ప్రజలు మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. ద్విచక్రవాహనంపై వస్తున్న అన్నాచెల్లెళ్లను ట్రాఫిక్ కానిస్టేబుళ్లు ఒక్కసారిగా అడ్డంపడి ఆపడంతో వారు అదుపుతప్పి కిందపడిపోయారు. ఈలోగా వెనుకవైపు వస్తున్న వాహనం వీరి వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ద్విచక్రవాహనంపై వస్తున్న వారికి-ట్రాఫిక్ పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అక్కడున్న ప్రజలు ప్రమాదానికి కారణమైన ట్రాఫిక్ కానిస్టేబుల్ మల్లికార్జున్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాధిత అన్నాచెల్లెళ్లు బి.నరసింహస్వామి, రాధికకు మద్దతుగా ఆందోళనకు దిగారు. పక్కనే ఉన్న ట్రాఫిక్ ఎస్సై రమణారెడ్డి కలుగజేసుకుని అన్నాచెల్లెళ్ల పట్ల దురుసుగా ప్రవర్తించడంతో కలెక్టరేట్ ముందు రోడ్డుకు అడ్డంగా వాహనాలు పెట్టి నిరసన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న వన్‌టౌన్ సీఐ కేవీ సుభాషిణి ఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రజలకు నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు. సంఘటనపై ఎస్పీ చిరువోలు శ్రీకాంత్, డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావుకు సమాచారం అందించారు.