-
వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలుగా ఏర్పాటు
-
యాదాద్రిలోకి దేవరుప్పుల మండలం
-
మూడు జిల్లాల్లో జనగామ, పాలకుర్తి నియోజకవర్గాలు
-
రెండు జిల్లాలో భూపాలపల్లి, ములుగు, వర్ధన్నపేట
-
వరంగల్ రెవెన్యూ డివిజన్‌లోకి పరకాల
-
కొత్తగా ఆరు మండలాలు ఏర్పాటు
-
పునర్విభజన ముసాయిదా విడుదల
-
నేడు గెజిట్ జారీ చేయనున్న కలెక్టర్ !
-
ముసాయిదాపై అభ్యంతరాల స్వీకరణ షురూ
-
నెలరోజులపాటు కొనసాగనున్న ప్రక్రియ
చారిత్రక నేపథ్యం ఉన్న వరంగల్ జిల్లా... ఇక నాలుగు భాగాలు కానుంది. జంట నగరాలైన వరంగల్, హన్మకొండలు వేర్వేరుగా జిల్లాలుగా ఏర్పడనున్నాయి. దశాబ్దాలపాటు వరంగల్ జిల్లాలకు ప్రత్యేకతను సమకూర్చిన అటవీ ప్రాంతం జయశంకర్(భూపాలపల్లి) జిల్లా కానుంది. గిరిజనులు ఎక్కువగా ఉండే మహబూబాబాద్ జిల్లాగా రూపుదిద్దుకోనుంది. పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జల్లాల పునర్విభజన ప్రక్రియ అధికారికంగా మొదలైంది. ప్రస్తుత ప్రతిపాదనలే కొనసాగితే సరిగ్గా 50 రోజుల తర్వాత వరంగల్ జిల్లా... నాలుగు జిల్లాలుగా మారనుంది.
సాక్షిప్రతినిధి, వరంగల్ : ఉత్కంఠ వీడింది. అన్ని వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న జిల్లాల పునర్విభజన ముసాయిదా నోటిఫికేషన్ జారీ అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం మధ్యాహ్నం ఈ మేరకు ఉత్తర్వులు(363) జారీ చేసింది. ముసాయిదాపై 30 రోజులపాటు సలహాలు, సూచనలు, అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు పేర్కొంది. జిల్లా స్థాయిలో తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ప్రత్యేంగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలని జిల్లా కలెక్టర్ వాకాటి కరుణను ఆదేశించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కరుణ... జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్విభజనపై మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ముసాయిదా నోటిఫికేషన్ ప్రకారం వరంగల్ జిల్లా... వరంగల్, హన్మకొండ, జయశంకర్(భూపాలపల్లి), మహబూబాబాద్ జిల్లాలుగా మారనుంది.
పునర్విభజన ముసాయిదా ప్రకారం వరంగల్ జిల్లాలో 17, హన్మకొండ జిల్లాలో 18, ఆచార్య జయశంకర్ జిల్లాలో 15, మానుకోట జిల్లాలో 12 మండలాలు ఉన్నాయి. కొత్తగా హన్మకొండ, హుజూరాబాద్, భూపాలపల్లి రెవెన్యూ డివిజన్లు ఏర్పాటవుతున్నాయి. ఖిలావరంగల్(వరంగల్), కాజీపేట(హన్మకొండ), ఐనవోలు(వర్ధన్నపేట), చిల్పూరు(స్టేషన్‌ఘన్‌పూర్), వేలేరు(ధర్మసాగర్), ఇల్లందకుంట(జమ్మికుంట) మండలాలు కొత్తగా ఏర్పాటవుతున్నాయి. ముసాయిదాపై సలహాలు, సూచనలు, అభ్యంతరాలను స్వీకరించే ప్రక్రియ మొదలైంది. హన్మకొండ జిల్లా ఏర్పాటు అవసరం లేదని కాంగ్రెస్ గ్రేటర్ వరంగల్ కమిటీ అభ్యంతరం తెలుపుతూ జిల్లా కలెక్టర్ కరుణకు లేఖ ఇచ్చింది.
జనగామౖపై అయోమయం...
జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని నెలలుగా ఉద్యమం చేస్తున్న జనగామపై ముసాయిదా నోటిఫికేషన్‌లో గందరగోళం నెలకొంది. ప్రస్తుత వరంగల్ జిల్లాలో 51 మండలాలు ఉన్నాయి. ముసాయిదాలో 50 మండలాల పేర్లను తెలుపుతూ... ఏ మండలం ఏ జిల్లాలో కలిసేది పేర్కొన్నారు. జనగామ మండలం పేరు నోటిఫికేషన్‌లో పేర్కొనలేదు. జిల్లా ఏర్పాటు కోసం ఉద్యమం కొనసాగించిన జనగామ విషయంలో ఇలా జరగడంపై జనగామ జిల్లా సాధన జేఏసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ముసాయిదా నోటిఫికేషన్‌లో మరో తప్పుదొర్లింది. దేవరుప్పుల మండలాన్ని హన్మకొండ జిల్లాలో, యాదాద్రి జిల్లాలో కలిపేలా ముసాయిదాలో పేర్కొన్నారు. దీంతో న్యాయపరంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండడంతో ఉన్నతాధికారులు గుర్తించారు. రాష్ట్ర స్థాయిలో మళ్లీ దీనిపై సవరణ ఉత్తర్వులు జారీ చేశారు. ముసాయిదా ప్రకారం జనగామ, పాలకుర్తి నియోజకవర్గాలు మూడు జిల్లాల్లో.... ములుగు, భూపాలపల్లి, వర్ధన్నపేట, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాలు రెండు జిల్లాల్లో ఉండనున్నాయి.
ముసాయిదా ప్రకారం జిల్లాలు ఇలా...
వరంగల్ జిల్లా : వరంగల్, ఖిలావరంగల్(కొత్తది), హసన్‌పర్తి, వర్ధన్నపేట, ఐనవోలు(కొత్తది), పర్వతగిరి, గీసుగొండ, సంగెం, ఆత్మకూరు, పరకాల, శాయంపేట, దుగ్గొండి, నల్లబెల్లి, నర్సంపేట, ఖానాపురం, చెన్నారావుపేట, నెక్కొండ.
హన్మకొండ జిల్లా : హన్మకొండ, కాజీపేట(కొత్తది), ధర్మసాగర్, వేలేరు(కొత్తది), స్టేషన్‌ఘన్‌పూర్, చిల్పూరు(కొత్తది), జఫర్‌గఢ్, రఘునాథపల్లి, పాలకుర్తి, రాయపర్తి, కొడకండ్ల, నర్మెట, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపురం, హుజూరాబాద్, జమ్మికుంట, ఇలందకుంట(కొత్తది).
జయశంకర్ జిల్లా : భూపాలపల్లి, చిట్యాల, మొగుళ్లపల్లి, రేగొండ, గణపురం, వెంకటాపురం, ములుగు, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట, కాటారం, మల్హర్‌రావు, మహాముత్తారం, మహదేవపూర్.
మహబూబాబాద్ : మహబూబాబాద్, గూడూరు, కేసముద్రం, నెల్లికుదురు, డోర్నకల్, కురవి, మరిపెడ, నర్సింహులపేట, కొత్తగూడ, తొర్రూరు, గార్ల, బయ్యారం.
యాదాద్రి జిల్లా : జనగామ, బచ్చన్నపేట, దేవరుప్పుల లింగాలఘనపురం, సిద్ధిపేట జిల్లా : చేర్యాల, మద్దూరు.
రెవెన్యూ డివిజన్ల వారీగా మండలాలు...
వరంగల్ : వరంగల్, ఖిలావరంగల్(కొత్తది), హసన్‌పర్తి, వర్ధన్నపేట, ఐనవోలు(కొత్తది), పర్వతగిరి, ఆత్మకూరు, గీసుగొండ, సంగెం, శాయంపేట, పరకాల.
నర్సంపేట : నర్సంపేట, చెన్నారావుపేట, నల్లబెల్లి, దుగ్గొండి, ఖానాపురం, నెక్కొండ.
హన్మకొండ : హన్మకొండ, కాజీపేట(కొత్తది), ధర్మసాగర్, చిల్పూరు(కొత్తది), వేలేరు(కొత్తది), స్టేషన్‌ఘన్‌పూర్, రాయపర్తి, జఫర్‌గఢ్, నర్మెట, రఘునాథపల్లి, పాలకుర్తి, కొడకండ్ల.
హుజూరాబాద్ : హుజూరాబాద్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపురం, జమ్మికుంట, ఇల్లందకుంట(కొత్తది).
భూపాలపల్లి : భూపాలపల్లి, గణపురం, రేగొండ, మొగుళ్లపల్లి, చిట్యాల, కాటారం, మహదేవపూర్, మల్హర్‌రావు, మహాముత్తారం,
ములుగు : ములుగు, వెంకటాపురం, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట.
మహబూబాబాద్ : మహబూబాబాద్, కురవి, కేసముద్రం, డోర్నకల్, నెల్లికుదురు, మరిపెడ, నర్సింహులపేట, తొర్రూరు, గూడురు, కొత్తగూడ, బయ్యారం, గార్ల.
జనగామ : జనగామ, లింగాలగణపురం, దేవరుప్పుల, బచ్చన్నపేట, ఆలేరు, గుండాల, రాజాపేట,
గజ్వేల్ : చేర్యాల, మద్దూరు.