నీటి కేటాయింపుల్లో సీమకు అన్యాయం
► కృష్ణా డెల్టాకు, తెలంగాణకు నీళ్లు తరలించేందుకు కుట్ర
► హంద్రీ-నీవాకు 45 టీఎంసీలు కేటాయించాలి
► మాజీ ఎంపీ అనంత డిమాండ్
అనంతపురం సెంట్రల్ : ఇరు రాష్ట్రాల నీటిపారుదలశాఖ మంత్రులు తమ ప్రాంతాల ప్రయోజనాలు చూసుకుని రాయలసీమకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. గురువారం ఆయన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ ర్షాభావంతో సీమలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయనీ, ‘సీమ’లోని ప్రాజెక్టులన్నీ కృష్ణాజలాలపైనే ఆధారపడ్డాయని తెలిపారు. కానీ సీమకు నీళ్లు అందిచండంలో ప్రభుత్వం పక్షపాత ధోరణి అవలంబిస్తోందని విమర్శించారు. ఏపీ ప్రభుత్వం కేంద్రం వద్ద ‘సీమ’ కరువును సాకుగా చూపి ఆచరణలో మాత్రం అన్యాయం చేస్తోందని ఆరోపించారు.
గతేడాది కరెంట్ ఉత్పత్తి పేరుతో తెలంగాణ , తాగునీటి ముసుగులో ఆంధ్రా పాలకులు శ్రీశైలం నీటిని త్రవ్వుకున్నారన్నారు. దీంతో సీమకు తీవ్ర నష్టం వాటిల్లిందనీ, ఈ ఏడాది కూడా గతేడాదిలాగే వారి స్వలాభాలు చూసుకుని సీమకు అన్యా యం చేసేందుకు ఇద్దరు మంత్రులు ప్రణాళిక రచించి బయటకు నాటకం ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ‘సీమ’ వాట అంశాన్ని బోర్డు ముందు ఉంచకపోవడమే దీనికి నిదర్శనమన్నారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను డెల్టాకు ఇస్తున్నారనీ... ఈ క్రమంలో శ్రీశైలం నుంచి హంద్రీ-నీవాకు 45 టీఎంసీలు ఇవ్వాలన్నారు. టీబీ డ్యాంలో పూడిక కారణంగా హెచ్చెల్సీ, ఎల్‌ఎల్‌సీకి దక్కాల్సిన నికర జలాలు ఏటా 85 టీఎం సీలు శ్రీశైలంలోకి చేరుతున్నాన్నారు. ఈ నీటినీ సీమకే కేటాయించాలన్నారు.
‘సీమ’లో భూములను బీళ్లుగా పెట్టి డెల్టాలో రెండు పంటలకు నీళ్లు అందించాలని మంత్రి దేవి నేని ఆలోచిస్తున్నారని విమర్శించారు. శ్రీశైలంలో 854 అడుగుల నీటిమట్టం ఉండేలా బోర్టు చర్యలు తీసుకోవాలనీ, ఆ తర్వాత విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నారు. రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులపై కృష్ణాబోర్డుకే యాజ మాన్య హక్కులు కల్పించి సీమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. .
ప్రభుత్వ డెయిరీని నిర్వీర్యం చేసే కుట్ర
టీడీపీ ముఖ్య ప్రజాప్రతినిధులు ప్రైవేటు డెయిరీని నిర్వహిస్తుండటం వల్ల వారి స్వలాభం కోసం ప్రభుత్వ డెయిరీని నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నారని మాజీ ఎంపీ అనంతవెంకట్రామిరెడ్డి ధ్వజమెత్తారు. దాదాపు 2 లక్షల కుటుంబాలు ప్రభుత్వ డెయిరీకి పాలు పోస్తూ జీవనం సాగిస్తున్నాయని వివరించారు. జిల్లాలోనే రూ. 11 కోట్లు పాల బకాయిలు ఉంటే రైతులు ఏ విధంగా బతుకుతారని ప్రశ్నించారు. వెంటనే బకాయిలు చెల్లించి, గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. లేకుంటే వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో పాడిరైతుల పక్షాన నిలబడి పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.