సింగూర్ ప్రాజెక్టులోకి భారీగా వచ్చిన వరద నీరు
- సింగూర్‌లో పెరిగిన నీటి మట్టం
- 16 టీఎంసీలకు చేరిన వరద నీరు
పుల్‌కల్: ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో సింగూర్ ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. ఇప్పటికే 16 టీఎంసీలకు నీరు చేరింది. ఆగస్టు 30 నాటికి కేవలం 4 టీఎంసీలు ఉండగా.. సెప్టెంబర్ 30 నాటికి 9 టీఎంసీలకు చేరింది. ఇటీవల కురిసిన వర్షాలకు ఈనెల 13 నుంచి 15వ తేది వరకు వచ్చింది. ఇంకా పది రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో మరో 10 టీఎంసీల నీరు వచ్చే అవకాశం ఉందని ఇరిగేషన్ శాఖ ఈఈ రాములు తెలిపారు.
ఊపందుకున్న వ్యాపారం
రెండు నెలల క్రితం వరకు పూర్తిగా అడుగంటిన సింగూర్ ప్రాజెక్టు ప్రస్తుతం కళకళలాడుతోంది. దీంతో బోటింగ్ చేసేందుకు సందర్శకులు ఆసక్తి చూపుతున్నారు. ప్రాజెక్టు పరిధిలో మూతపడిన వ్యాపారాలు సైతం ఊపందుకుంటున్నాయి.
ప్రభుత్వం అనుకుంటే సాగుకు నీరు
సింగూర్ ప్రాజెక్టు నుంచి మండల పరిధిలో సాగుకు నీరు అందించే స్థాయికి వరద చేరింది. అయితే, ఇందుకు ప్రభుత్వం ఆమోదం తెలపాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే గత ఆగస్టు 15 నుంచే సింగూర్ ప్రాజెక్టు ద్వారా పంటల సాగుకు నీరు ఇస్తామని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు.
అందుకు అనుగుణంగానే కాల్వ పనులు పూర్తి చేసేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులను పరుగులు పెట్టించాలి. అంతేకాకుండా ఆర్డీఓ పర్యవేక్షణలో కాల్వల పరిధిలోని భూసమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఈక్రమంలో ఎత్తిపోతల పథకం వద్ద మినహా.. దాదాపుగా పనులు పూర్తయ్యాయి. కనీసం పదివేల ఎకరాలకు నీరు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని ఎస్‌ఈ మదుసుధన్ ‘సాక్షి’కి తెలిపారు.