సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్, మెదక్ జిల్లాల పరిధిలోని రెండు లక్షల ఎకరాల ఆయకట్టుకు సింగూరు ద్వారా రెండో పంటకు అవసరమైన నీరు అందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. సింగూరు ప్రాజెక్టులో ప్రస్తుతం 29 టీఎంసీల నీటినిల్వ ఉంది. మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, హరీశ్‌రావు శనివారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలసి ఈ నీటిని నిజాంసాగర్‌కు విడుదల చేసి రెండో పంటకు నీరందించాలని కోరారు. సింగూరు నుంచి నీరు విడుదల చేయడం ద్వారా నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, ఆందోల్ నియోజకవర్గాల పరిధిలో సుమారు రెండు లక్షల ఎకరాల్లో రెండో పంట పండించుకునే అవకాశం ఉందని వీరు ముఖ్యమంత్రికి తెలిపారు.
రెండో పంట పండించుకోవడం ఇక్కడి ప్రజల చిరకాల కోరిక అని, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ కల నెరవేరే అవకాశం వచ్చిందని విన్నవించారు. కాల్వలు కూడా సిద్ధంగా ఉన్నందున సింగూరు నుంచి నిజాంసాగర్‌కు 9 టీఎంసీల నీరు వదిలితే, ఇప్పటికే నిజాంసాగర్‌లో ఉన్న 3 టీఎంసీలతో కలిపి నీటి నిల్వలు 12 టీఎంసీలకు చేరుకుంటాయని పోచారం చెప్పారు. ఆ నీటిని పొదుపుగా వాడుకుని నిజాంసాగర్ ఆయకట్టు కింద ఉన్న లక్షా 20వేల ఎకరాల్లో రెండో పంట సాగుచేసుకుంటారని ఆయన వివరించారు. అదే విధంగా సింగూరు నీటితో ఘణపురం ఆనకట్టను నింపుకుని 30వేల ఎకరాలకు, ఆందోల్ ఎత్తిపోతల పథకం ద్వారా మరో 40 వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని హరీశ్‌రావు తెలియజేశారు. దీనికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.
అవకాశం వదులుకోవద్దు..
సమైక్య రాష్ట్రంలో రైతులు మొదటి పంట పండించుకోవడానికే నీళ్లు లేక అవస్థలు పడ్డారని, ఇప్పుడు రెండో పంట పండించుకునే అవకాశం వస్తే ఎట్టి పరిస్థితుల్లోను వదులు కోవద్దని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. సింగూరు నుంచి నిజాంసాగర్‌కు 9 టీఎంసీల నీరు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా, శనివారం సాయంత్రం నుంచే నీటిని విడుదల చేస్తామని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఈనీటిని విడుదల చేస్తున్న సందర్భంలోనే సింగూరు వద్ద జలవిద్యుత్ ఉత్పత్తి ప్రారంభించాలని జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావును సీఎం ఆదేశించారు. సింగూరు వద్ద 15 మెగావాట్ల యూనిట్‌తో పూర్తి స్థాయి జలవిద్యుత్ ఉత్పత్తి చేస్తామని ప్రభాకర్ రావు వెల్లడించారు. తెలంగాణ వస్తే రెండో పంటకు కూడా నీరు ఇచ్చుకునే విధంగా నీటి పారుదల వ్యవస్థను మార్చుకుంటామనే మాట నిజమవుతోందని, పాత నిజామాబాద్, మెదక్ జిల్లాల పరిధిలోని రైతుల చిరకాల వాంఛ అయిన రెండో పంటకు నీరందే స్వప్నం నెరవేరబోతోందని సీఎంఓ ఒక ప్రకటనలో తెలిపింది.
Published Sun, Oct 8 2017 2:07 AM | Last Updated on Fri, Nov 9 2018 6:05 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment