టీబీ డ్యాం నుంచి నీటి విడుదల
Published Mon, Aug 29 2016 10:32 PM | Last Updated on Tue, May 29 2018 4:26 PM
– ఫలించిన వైఎస్‌ఆర్‌సీపీ నేతల ప్రయత్నం
కర్నూలు సిటీ: తుంగభద్ర డ్యాం నుంచి సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో నదికి 3వేల క్యూసెక్కుల చొప్పున నీరు విడుదల చేశారు. నదీ పరీవాహక ప్రాంతంలో ఈ ఏడాది వర్షాలు కురవకపోవడంతో ఈ నీటిపై ఆధారపడిన సాగునీటి ప్రాజెక్టులు ఇబ్బందుల్లో పడ్డాయి. కేసీ కింద సాగు చేసిన ఆయకట్టుకు నీరందక పంటలు ఎండుతున్నాయి. ఈ నేపథ్యంలో కేసీకి నీరు విడుదల చేయాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ సభ్యురాలు బుట్టా రేణుక.. పాణ్యం, నందికొట్కూరు ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, ఐజయ్యలు అధికారులపై తీవ్ర ఒత్తిళ్లు తీసుకొచ్చారు. ఇదే సమయంలో రైతులు కూడా ఆందోళనలు చేపట్టడంతో జల వనరుల శాఖ అధికారులు టీబీ డ్యాంలో కేసీకి రావాల్సిన వాటా నుంచి నీటి విడుదలకు ఇండెంట్ పెట్టారు.
అయితే రాష్ట్ర స్థాయి అధికారులు ఆ మేరకు నీరు విడుదల చేయాలని బోర్డు అధికారులను కోరడంలో జాప్యం జరిగింది. ఫలితంగా ఎంపీ బుట్టా రేణుక, ఎమ్మెల్యేలు కేసీ ఆయకట్టుదారుల అవస్థలు, నదీ తరంలో తుంగభద్ర జలాలపై ఆధారపడిన గ్రామాల్లో నెలకొన్న నీటి ఎద్దడిని జల వనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ దష్టికి తీసుకెళ్లారు. డ్యాం నుంచి కచ్చితంగా నీరు విడుదల చేయాలని గట్టిగా అడగటంతో ఎట్టకేలకు బోర్డు అధికారులు అనుమతించారు. ఆ మేరకు సోమవారం టీబీ డ్యాం నుంచి నీరు విడుదలయింది. 3వేల క్యూసెక్కుల చొప్పున 5 రోజులు.. 1500 క్యూసెక్కులు చొప్పున 10 రోజుల పాటు నీరు విడుదల చేయాలని జిల్లా అధికారులు ఇండెంట్ పెట్టారు. అయితే ప్రస్తుతం డ్యాంలో నీల్వ నీటి ప్రకారం కేసీకి 3 టీఎంసీలు మాత్రమే ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Advertisement