చెంచుల సంక్షేమానికి కృషి
-
కలెక్టర్ సుజాతశర్మ
యర్రగొండపాలెం: గిరిజన చెంచుల సంక్షేమం కోసం ప్రభుత్వ శాఖలన్నీ కలసికట్టుగా పనిచేయాలని కలెక్టర్ సుజాతశర్మ అధికారులకు సూచించారు. మండలంలోని వెంకటాద్రిపాలెంలో కలెక్టర్ అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చెంచులు నివసించే ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. నల్లమల అడవుల్లోని పాలుట్ల గిరిజన గూడేనికి ప్రతినెలా 5, 20 తేదీల్లో వైద్యాధికారులు వెళ్లి వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. గిరిజన గూడెంలో నీటి వసతి కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆర్‌డబ్లూ్యఎస్ అధికారులను ఆదేశించారు.
చెన్నుపల్లి(అల్లిపాలెం) చెంచు గూడెంను రెవెన్యూ గ్రామంగా మార్చి అన్ని సదుపాయాలు కల్పించాలని స్థానికులు కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. అటవీ హక్కుల చట్టం కింద 350 ఎకరాల మేరకు సాగుభూమికి పట్టాలిచ్చారని, అక్కడే నివాసం ఉండి వ్యవసాయం చేసుకుంటున్నామని వారు తెలిపారు. నివాస స్థలాలకు పట్టాలు ఇవ్వకుండా ఫారెస్ట్ అధికారులు అడ్డు పడుతున్నారన్నారు. నల్లమల అడవుల్లో నివసించే చెంచులకు ఆర్‌ఏపీ, టీఏపీ, డబ్ల్యూపీ కింద 170 రేషన్ కార్డులు ఇచ్చారని, ఈ కార్డులకు ఒక్కొక్క దానికి కేవలం 4 నుంచి 10 కిలోల బియ్యం ఇస్తున్నారని, ఈ కార్డులను అంత్యోదయ అన్న యోజన కింద మార్పుచేసి కార్డుకు 35 కిలోల ప్రకారం బియ్యం పంపిణీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని గిరిజన చెంచు సంక్షేమ సంఘం నాయకులు చెవుల అంజయ్య, ఎన్.ఈదన్న, మంతన్న కోరారు.
పునరావాస కాలనీలో శ్మశాన lవాటికకు స్థలం చూపించాలని, పక్కా గృహాలు ఏర్పాటు చేయాలని చెంచులు కోరారు. వేలి ముద్రలు పడటంలేదని డీలర్ రేషన్ ఇవ్వడం లేదని వారు ఆరోపించారు. పునరావాస కాలనీకి రోడ్డు వేయాలని, డీప్‌వెల్ బోరువేసి మంచినీరు సరఫరా చేయాలని మినీ అంగన్‌వాడీ భవన నిర్మాణం చేపట్టాలని ఆయా శాఖల అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ముందుగా వెంకటాద్రిపాలెం, పునరావాస కాలనీల్లోని అంగన్‌వాడీ కేంద్రాలను ఆమె సందర్శించారు. మెుక్కలు నాటారు. యర్రగొండపాలెంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలలను ఆమె పరిశీలించారు.
కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ డి.శ్రీనివాసరావు, మార్కాపురం ఆర్డీవో చంద్రశేఖరరావు, నియోజకవర్గ ప్రత్యేకాధికారి పి.కొండయ్య, డ్వామా ఏపీడీ రమేష్‌బాబు, జిల్లా వైద్యాధికారిణి యాస్మిన్, డీపీవో ఎస్‌ఎస్‌వీ ప్రసాద్, డీటీడబ్ల్యూ ప్రేమానందం, పంచాయతీరాజ్ ఎస్‌ఈ చంద్రశేఖరయ్య, ఐసీడీఎస్ పీడీ జి.విశాలాక్ష్మి, హౌసింగ్ ఈఈ తారకరామారావు, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ కె.వెంకటేశ్వర్లు, ఏఈ ఆరె భవాని, తహశీల్దార్ ఎం. రత్నకుమారి, ఎంపీడీవో టి.హనుమంతరావు, ఎన్‌ఆర్‌ఈజీఎస్ ఏపీడీ టి.వెంకటేశ్వర్లు, ఏడీఏ డి.బాలాజీనాయక్ పాల్గొన్నారు.