
ఉత్తర కోస్తాకు భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
విశాఖపట్నం: ఒడిషా, పశ్చిమ బెంగాల్ తీరానికి ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడన ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు.. ఒడిషా నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అలాగే.. దక్షిణ కోస్తా, తెలంగాణల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం వెల్లడించింది.