బ్రాహ్మణ కుటుంబాలకు సంక్షేమ ఫలాలు
Published Mon, Feb 27 2017 12:53 AM | Last Updated on Tue, Sep 5 2017 4:41 AM
– జిల్లా కోఆర్డినేటర్ సముద్రాల హనుమంతరావు
కర్నూలు (అర్బన్): ఇప్పటి వరకు 30 వేల బ్రాహ్మణ కుటుంబాలు వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిపొందాయని బ్రాహ్మణ కార్పొరేషన్ జిల్లా కోఆర్డినేటర్ సముద్రాల హనుమంతరావు తెలిపారు. ఆదివారం స్థానిక సంకల్‌బాగ్‌లోని శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ కార్పొరేషన్ ఏర్పాటైన తర్వాత ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు ఒక లక్ష మంది వరకు బ్రాహ్మణులు లబ్ధిపొంది ఉంటారన్నారు. బ్రాహ్మణుల సంక్షేమం కోసమే కార్పొరేషన్ చైర్మెన్ ఐవైఆర్ కృష్ణారావు అనేక పథకాలను ప్రవేశపెడుతున్నారని చెప్పారు. విద్య, ఉపాధి, వైద్య రంగాలతో పాటు 60 సంవత్సరాలు దాటిన బ్రాహ్మణ వృద్ధులకు నెలకు రూ.1000 పింఛన్ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. రిజిస్టర్ అయిన వృద్ధాశ్రమాల్లో ఉన్న వారికి రూ.3 వేలు ఇచ్చే విధంగా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. అర్చకులకు రిటైర్డ్‌మెంటు లేకుండా చేశామని చెప్పారు. అనంతరం బ్రాహ్మణ సంఘం నేతలు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి హెచ్‌కే మనోహర్, జిల్లా అర్చక పురోహితుల సంఘం అధ్యక్షుడు రవిచంద్ర, కార్యదర్శి చెరువు దుర్గాప్రసాద్, హెచ్‌కే రాజశేఖర్, ఎస్.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement