వాట్స్‌యాప్‌లో హిందీ ప్రశ్నపత్రం
కడప ఎడ్యుకేషన్: విద్యాశాఖ ఆ«ధ్వర్యంలో 6 నుంచి 10వ తరగతి వరకూ విద్యార్థులకు ప్రస్తుతం నిర్వహిస్తున్న(ఆరు నెలల పరీక్షలు) సమ్మెటివ్ అసెస్‌మెంట్–2కు సంబంధించిన ప్రశ్నపత్రాలు లీక్ అయినట్లు తెలిసింది. ఇందుకు సంబం«ధించిన ప్రశ్నపత్రాలు పలువురి మొబైల్ ఫోన్లలోని వాట్స్‌యాప్‌లలో హల్‌చల్ చేస్తున్నాయి. çసమ్మెటివ్ çపరీక్షలకు సంబంధించి సబ్జెక్టు పశ్నపత్రాలు పరీక్ష జరిగే ఒక రోజు ముందు వాట్స్‌యాప్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. అలా వచ్చిన ప్రశ్నపత్రాల గురించి తెలుసుకున్న విద్యార్థులు తమ స్నేహితులకు సమాచారాన్ని చేరవేసి వాటినే ప్రిపేర్ అవుతున్నట్లు తెలిసింది. కొన్ని ప్రైవేటు పాఠశాలల యజమాన్యం కూడా ఆ పేపర్‌నే ప్రిపేర్ కావాలని సూచిస్తున్నట్లు సమాచారం. గతంలో జరిగిన సమ్మెటివ్ అసెస్‌మెంట్–1 పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాలు కూడా అప్పట్లో లీక్ అయినట్లు తెలుస్తోంది. 9వ తేదీ సోమవారం జరగనున్న పదో తరగతి హిందీ ప్రశ్నపత్రంతోపాటు బిట్‌పేపర్ కూడా ఆదివారం వాట్స్‌యాప్‌లో ప్రత్యక్షమైంది. ఈ ప్రశ్నపత్రాలు కడప నగరం నకాష్ ప్రాంతంలోని ఒక ఇంటర్‌నెట్ నుంచి బయటకు వచ్చినట్లు తెలిసింది. ఈ నెట్ సెంటర్ యజమాని ఒక సెట్‌కు రూ.3500 వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ విషయమై డీసీఈబీ సెక్రటరీ నారాయణరెడ్డిని వివరణ కోరగా వాట్స్‌యాప్‌లో ప్రశ్నపత్రం వచ్చినట్లు తమ దృష్టికి రాలేదన్నారు. ప్రశ్నపత్రాల ప్రిటింగ్ అంతా విజయవాడలో జరుగుతుందని అక్కడి నుంచి వచ్చిన ప్రశ్నపత్రాలను తాము చాలా భద్రంగా పాఠశాలలకు పంపుతామన్నారు. కానీ నిజానిజాలు పరిశీలించి బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు.