తెలుపు రంగు స్థానంలో గులాబీ రంగు
బోధన్ : పట్టణంలోని ఆర్టీసీ డిపో ఎదుట తెలంగాణ మజ్దూర్ యూనియన్ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదాస్పదమైంది. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలో పొరపాటు చోటు చేసుకుంది. టీఎంయూ నేతలు ఫ్లెక్సీలో ముద్రించిన జాతీయ పతాకంలో తెలుపు రంగు స్థానంలో గులాబీ రంగు ఉండడం చూసిన వారు నోరెళ్లబెట్టారు. దీన్ని గుర్తించిన ఇతర కార్మిక సంఘం నేతలు జాతీయ పతాకాన్ని అవమానపరిచేలా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారని అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో డిపో అధికారులు డిపోలోంచి తెలుపు రంగు తీసుకొచ్చి గులాబీ రంగు స్థానంలో అద్దారు. జాతీయ పతాకాన్ని అవమానపరిచిన టీఎంయూ నేతలపై ఫిర్యాదు చేస్తామని ఇతర కార్మిక సంఘాల నేతలు తెలిపారు.