ఆధిపత్య పోరు.. హత్యలకూ వెనకాడరు | AADHIPATHYA PORU.. HATHYALAKU VENAKAADARU | Sakshi
Sakshi News home page

ఆధిపత్య పోరు.. హత్యలకూ వెనకాడరు

Published Sun, Jun 11 2017 12:16 AM | Last Updated on Wed, Jul 10 2019 7:55 PM

ఆధిపత్య పోరు..  హత్యలకూ వెనకాడరు - Sakshi

ఆధిపత్య పోరు.. హత్యలకూ వెనకాడరు

సాక్షి ప్రతినిధి, ఏలూరు : ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను హత్య చేయించేందుకు రెడ్డి అప్పలనాయుడు పన్నిన కుట్ర బట్టబయలు కావడం అధికార పార్టీలో కలకలం రేపుతోంది. టీడీపీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న వెంకటాపురం మాజీ సర్పంచ్‌ అప్పలనాయుడు ఇందుకోసం ఓ రౌడీ ముఠాకు రూ.10 లక్షల సుపారీ ఎరవేసినట్టు పోలీసులు చెబుతున్నారు. దెందులూరు నియోజకవర్గంలో కీలక నేతగా ఎదిగిన రెడ్డి అప్పలనాయుడును రాజకీయంగా దెబ్బతీసేందుకు యత్నిస్తున్న చింతమనేని అతడి ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టడంతో ప్రతీకారంతో రగిలిపోయి కుట్రకు తెరతీశారని పోలీసుల కథనాన్ని బట్టి అవగతమవుతోంది. 
 
కుట్రకు దారితీసిన పరిస్థితులివీ
అప్పలనాయుడు భార్య అనురాధ ఏలూరు ఎంపీపీగా ఎన్నికయ్యారు. ఆ పదవిని అనురాధకు, మోరు హైమావతికి చెరో రెండున్నరేళ్ల చొప్పున పంచుతూ ఎన్నికల సందర్భంలో పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. రెండున్నరేళ్ల అనంతరం తన భార్య పదవీ కాలాన్ని ఇంకో ఏడాది పొడిగిం చాలని అప్పలనాయుడు అడగటం, దానికి చింతమనేని నిరాకరించడం తెలిసిందే. దీంతో రెడ్డి అనురాధ ఆ పదవికి రాజీనామా చేశా రు. మోరు హైమావతి ఎంపీపీ అయ్యారు. అనురాధ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని కాంట్రాక్ట్‌లను బినామీ పేర్లతో రెడ్డి అప్పలనాయుడు దక్కించుకున్నట్టు సమాచారం. ఆమె పదవి నుంచి దిగిపోగానే అప్పలనాయుడు నేరుగా చింతమనేని ప్రభాకర్‌పై విమర్శలు చేయడం, దీంతో ఆయన చేసిన పనులకు సంబంధించిన బిల్లులను చింతమనేని నిలుపుదల చేయించడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. పదవి పోవడం, సుమారు రూ.50 లక్షల వరకూ బిల్లులు నిలిచి పోవడంతో.. తమను ఆర్థికంగా ఇబ్బంది పెట్టిన చింతమనేనిని అడ్డు తొలగించుకోవాలనే నిర్ణయానికి అప్పలనాయుడు వచ్చినట్టు టీడీపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఎమ్మెల్యేను అంతం చేయడానికి కుట్ర పన్నారనే విషయం తెలిసిన తర్వాత కూడా పోలీసులు వ్యవహరించిన తీరు బాగా లేదని చింతమనేని ప్రభాకర్‌ అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. 
ఎమ్మెల్యే బడేటిపై 
 
చింతమనేని వర్గం గుర్రు
ఇదిలావుంటే.. చింతమనేని హత్యకు కుట్ర పన్నారనే విషయం వెలుగు చూసిన అనంతరం అప్పలనాయుడును ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి వెంటబెట్టుకుని తీసుకువెళ్లి డీఎస్పీకి అప్పగించి రావడంపై చింతమనేని వర్గం గుర్రుగా ఉంది. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందని ఆ వర్గం ప్రశ్ని స్తోంది. ఈ వ్యవహారంపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు దెందులూరు నియోజకవర్గ కార్యకర్తలు, నేతలు ఫిర్యాదు చేశారు. చింతమనేని ప్రభాకర్‌కు రక్షణ పెంచాలని కోరారు. మరోవైపు ఏలూరులో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయని, పట్టపగలే ఒంటరిగా తిరిగే పరిస్థితి లేకుండా పోయిందని ఆరోపించారు.
 
హత్యా రాజకీయాలకు కేంద్రంగా..
ఏలూరు నగరం కొంతకాలంగా హత్యా రాజకీయాలకు కేంద్రంగా మారింది. చిన్నచిన్న కారణాలకు నేపథ్యంలోనూ హత్యలు జరిగిపోతున్నాయి. అధికార పార్టీకి చెందిన భీమవరపు సురేష్, కొల్లి శంకరరెడ్డి వర్గాలు ఒకరిని మరొకరు చంపుకునేందుకు రెక్కీలు కూడా జరుపుకున్నట్టు పోలీ సుల విచారణలో వెల్లడైంది. వీరిలో కొల్లి శంకరరెడ్డి చింతమనేని హత్యకు కుట్ర పన్నిన కేసులో నిందితుడిగా ఉన్నాడు. అతనిని శనివారం తూర్పుగోదావరి జిల్లాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. భీమవరపు సురేష్‌ ఇక్కడి పోలీసులకు దొరికితే ఈ హత్యల పరంపరకు చెక్‌ పెట్టినట్టు అవుతుంది. రౌడీయిజాన్ని అణచివేస్తానని పదేపదే చెప్పే ముఖ్యమంత్రి ప్రశాంతతకు మారుపేరైన పశ్చిమ గోదావరి జిల్లాలో ఏకంగా ఎమ్మెల్యే హత్యకు కుట్ర జరగడంపై ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. 
 
రూ.10 లక్షల సుపారీ
చింతమనేనిని చంపడానికి నక్కల పండు అనే రౌడీషీటర్‌కు, అతని గ్యాంగ్‌కు రూ.పది లక్షల సుపారీ ఇవ్వడానికి బేరం కుదిరినట్టు పోలీసులు చెబుతున్నారు. తొలుత రాంబార్కి పురంధర్‌ అనే వ్యక్తి వ్యాపార పరంగా తనకు అడ్డు తగులుతున్న కోమర్తి మధు అనే వ్యాపారిని చంపించేందుకు కుట్ర పన్నినట్టు భోగట్టా. ఇందుకోసం రూ.లక్ష ఇచ్చేందుకు రౌడీ ముఠాతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం. అప్పలనాయుడుకు పురంధర్‌ స్నేహితుడు కావడంతో పనిలో పనిగా రౌడీషీటర్‌ జుజ్జువరపు జయరాజును కూడా హత్య చేయించేందుకు అప్పలనాయుడు పథకం వేశాడు. వారిద్దరినీ హతమార్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో.. ఎలాగూ అడ్వాన్స్‌ ఇచ్చాం కదా అనే ఉద్దేశంతో చింతమనేని ప్రభాకర్‌ను హతమార్చే బాధ్యతను అదే ముఠాకు అప్పగించినట్టు సమాచారం. ముఠా సభ్యులు కత్తులను సిద్ధం చేసుకుని చింతమనేని తరచూ వెళ్లే తోట వద్ద ఓ రోజు కాపు కాశారు. ఆ సమయంలో చింతమనేని అటు రాకపోవడంతో వారి ప్రయత్నాలు ఫలించలేదని సమాచారం. ఇదిలావుంటే.. హత్యకు కుట్ర పన్నిన ముఠా సభ్యుల మధ్య విభేదాలు తలెత్తడంతో అసలు విషయం బయటకు పొక్కిందని చెబుతున్నారు. లేనిపక్షంలో ఏదో ఒక హత్య జరిగి ఉండేదంటున్నారు. 
 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement