పోలీసులు స్పందిస్తే నాన్న బతికేవారు
- ఎస్పీ ఎదుట కృష్ణారావు కుమారుడి ఆవేదన
- ఘటనాస్థలాన్ని పరిశీలించిన ఎస్పీ
గొట్టుముక్కల(కంచికచర్ల) :‘పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే మా నాన్న బతికేవాడు..’ అంటూ గొట్టుముక్కల ఉప సర్పంచిఆలోకం కృష్ణారావు కుమారుడు జిల్లా ఎస్పీ విజయకుమార్ ఎదుట కన్నీరుమున్నీరుగా విలపించారు. కృష్ణా జిల్లాలో గొట్టుముక్కలలో ఆదివారం అర్ధరాత్రి కృష్ణారావు హత్య గురించి తెలియడంతో సోమవారం ఉదయం ఎస్పీ గ్రామానికి వచ్చారు. కృష్ణారావు కుటుంబ సభ్యులను కలిసి వివరాలు తెలుసుకున్నారు.
తమ ఇంటి వద్ద తెలుగుదేశం పార్టీ వర్గీయులు మద్యం తాగి వచ్చి గొడవ చేస్తున్నారని కంచికచర్ల పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినా వారు సకాలంలో రాలేదని శ్రీనివాసరావు ఎస్పీకి వివరించారు. ఎన్నికల ముందు నుంచి టీడీపీ వర్గీయులు గ్రామంలో విచ్చలవిడిగా రెచ్చిపోతూ వైఎస్సార్ సీపీ సానుభూతిపరులపై దాడులు చేస్తున్నారని చెప్పారు. అనేకసార్లు పోలీసులకు ఫిర్యాదులు చేసినా ఇరువర్గాలపై కేసులు నమోదు చేస్తున్నారని, దాడులు చేసిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు.
కంచికచర్ల పోలీసుస్టేషన్ రూరల్ సీఐ, ఎస్‌ఐ టీడీపీ నేతలకు కొమ్ముకాస్తున్నారని, వెంటనే వారిని సస్పెండ్ చేయాలని కృష్ణారావు కుటుంబ సభ్యులు ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ కృష్ణారావును హత్య చేసిన వారిని పట్టుకొని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నందిగామ డీఎస్పీ చిన్న హుస్సేన్, నందిగామ, నందిగామ రూరల్ సీఐలు భాస్కరరావు, రామ్‌కుమార్, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
నిందితులను పట్టుకుంటాం : ఎస్పీ
నందిగామ: కృష్ణారావు హత్య కేసులో నిందితులను పట్టుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ విజయకుమార్ తెలిపారు. గొట్టుముక్కల గ్రామంలో ఘటనాస్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆయన నందిగామ డీఎస్పీ కార్యాలయానికి వచ్చారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ శాంతిభద్రతల విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. గొట్టుముక్కలలో టీడీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్న స్థానికులు తన దృష్టికి తీసుకొచ్చారని, పూర్తిస్థాయిలో విచారించి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తాను ఇటీవలే ఎస్పీగా బాధ్యతలు స్వీకరించానని, ఈ గ్రామానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెప్పించుకుంటానని తెలిపారు.
నందిగామలో కూడా సీసీఎస్ స్టేషన్ ఏర్పాటుపై ఉన్నతాధికారులతో మాట్లాడతానని చెప్పారు. నేరాల విచారణకు సీసీఎస్ టీమ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. నందిగామలో పోలీస్ క్వార్టర్స్ విషయంలో కూడా త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఎస్పీని కలిసిన వైఎస్సార్ సీపీ నేతలు
కృష్ణారావుకు కుమారుడు శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ నాయకులు అక్కారావు, గుదే వెంకటేశ్వరరావు (బుజ్జీ), మరికొందరు నాయకులు ఎస్పీని కలిసి గ్రామంలో పరిస్థితులు వివరించి రక్షణ కల్పించాలని కోరారు. పోలీస్‌స్టేషన్ల ముందే దాడులకు పాల్పడుతున్నా టీడీపీ కార్యకర్తలను ఎస్‌ఐ, సీఐలు ఏమీ చేయలేకపోయారని చెప్పారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ విచారించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఫోన్ ద్వారా తనకు సమాచారం ఇవ్వాలని సూచించారు. గ్రామంలో పోలీస్ పికెట్ కొనసాగిస్తామని తెలిపారు.