
స్మగ్లర్ల ఆటకట్టించేదెవరు?
సమన్వయంతో అక్రమ రవాణాను నియంత్రించండి..
విలువైన ఎర్రచందనం తరలిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత పోలీసులు, అటవీశాఖపై ఉంది.. లోతైన దర్యాప్తు చేసి మూలాలను వెలికి తీయండి.. ఇవి అప్పుడప్పుడూ సమావేశాలు ఏర్పాటు చేసి ఉన్నతాధికారులు జిల్లా, కింది స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేçస్తుంటారు. అయితే మరోవైపు ఎర్రదొంగలు మరింత తెలివి మీరి సంబంధిత శాఖల అధికారుల కళ్లుగప్పి ఎర్రచందనాన్ని అక్రమ రవాణాను కొనసాగిస్తున్నారు.
నెల్లూరు(బారకాసు): తక్కువ సమయంలో రూ.లక్షలు కొల్లగొట్టే ఆదా య వనరుగా మారిన ఎర్రచందనం స్మగ్లింగ్ నానాటికి పతాక స్థాయికి చేరుకుంటోంది. కొందరు అధికార పార్టీ నాయకులు కీలక పాత్ర పోషిస్తూ స్మగ్లర్ల అవతారం ఎత్తడంతో అక్రమ రవాణాకు అడ్డూఅదుపూ లేకుండా పో తోంది. అధికారుల్లోనూ కొందరి అండ లభిస్తుండటంతో ఈ అక్రమ వ్యాపారం మూడు చెట్లు ఆరు దుంగలుగా సాగిపోతోంది. ప్రభుత్వం అదనపు బలగాలను అడవు ల్లో మోహరించినా సిబ్బందికి ఆయుధాలిచ్చినా దుంగ ల దొంగతనానికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు.
1.90 లక్షల హెక్టార్లలో ఎర్రచందనం
జిల్లాలోని మర్రిపాడు, అనంతసాగరం, ఆత్మకూరు, సీతారామపురం, వెంకటగిరి, రాపూరు, డక్కిలి, కలువాయి తదితర ప్రాంతాల్లోని అడవుల్లో దాదాపు 1.90 లక్షల హెక్టార్లలో ఎర్రచందనంచెట్లు విస్తరించి ఉన్నాయి. నాణ్యమైన ఈ చందనానికి విదేశాల్లో గిరాకీ ఉండడంతో స్మగ్లర్లు వీటిపై కన్నేశారు. అటవీశాఖలోని కొందరు ఇంటి దొంగల సహకారంతో అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు స్మగ్లర్ల అవతారం ఎత్తారు. చిత్తూరు, వైఎస్సార్‌కడప, నెల్లూరుజిల్లాలకు చెందిన పలువురు ఈ స్మగ్లింగ్ వ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. స్థానిక కూలీలతో పాటు తమిళనాడు నుంచి కూలీలను రప్పించి కోట్లాదిరూపాయల విలువైన ఎర్రచందనాన్ని చెన్నై, బెంగళూరుకు అక్కడి నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు.
ఇంటిదొంగల అండతోనే..
ఎర్రచందనం స్మగ్లింగ్ రోజురోజుకూ పెరుగుతున్నా అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్న దాఖలాలు లేవు. ఆ శాఖలోని కొందరు అధికారులే స్మగ్లర్లతో కుమ్మక్కు కావడంతో నిజాయితీగా పనిచేసేవారున్నా అడ్డుకట్ట వేయలేకపోతున్నారనే ఆరోపణలున్నాయి.
సివిల్ పోలీసుల పాత్ర
స్మగ్లింగ్ వ్యవహారంలో అటవీ అధికారులు, సిబ్బందితో పాటు పోలీసుల పాత్రపైనా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సహకరిస్తున్నారనే ఆరోపణలపై గతంలో వైఎస్సార్‌కడప జిల్లాలో ముగ్గురు సీఐలతో పాటు 21మంది పోలీసులు, ఫారెస్ట్ సిబ్బందిని సస్పెండ్ చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే సివిల్ పోలీసులతో పాటు అటవీశాఖ ఉద్యోగులు కొందరు చర్యల నుంచి తప్పించుకుంటూ స్మగ్లింగ్‌లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఉన్నతాధికారులు వీరిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్న దాఖలాలు లేవు. ఏదైనా ఘటన జరిగినప్పుడు ప్రకటనలతో హడావుడి చేసి అనంతరం మౌనం దాలుస్తున్నారనే విమర్శలున్నాయి.
ప్రకటనలకే పరిమితం
గతంలో చిత్తూరు జిల్లాలో అటవీశాఖ అధికారులపై స్మగ్లర్లు దాడులు చేసి హతమార్చిన నేపథ్యంలో అటవీ సిబ్బందికి ఆయుధాలిస్తామని అంతేకాకుండా అటవీశాఖలో కొరతగా ఉన్న సిబ్బంది సంఖ్యను పెచుతామని పలుమార్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆయుధాలు ఇప్పటి వరకు ఇవ్వక పోగా సిబ్బంది నియామకం కూడా చేపట్టలేదు.
అడ్డుకునేందుకు ప్రత్యేక చర్యలు
జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా జరగకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న సమాచారం తెలిస్తే వెంటనే తనిఖీలు నిర్వహించి పట్టుకుంటున్నాం. జిల్లా సరిహద్దులో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేశాం. ఎంతటి వారైనా ఆటవీ సంపదను అక్రమంగా కొల్లగొడితే ఉపేక్షించేది లేదు.
–చంద్రశేఖర్, ఇన్‌చార్జి డీఎఫ్‌ఓ