అడ్డుగా ఉన్నాడనే అంతమొందించారు!
కళ్యాణదుర్గం : కుందుర్పి మండలం కరిగానిపల్లెకు చెందిన గూగుళ్ల రుద్రన్న ఇదే మండలం అపిలేపల్లి సమీపంలో గత నెల 10న అనుమానాస్పద స్థితిలో మరణించిన కేసులో భార్యే హంతకురాలని తేలింది. తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే ఉద్దేశంతో ప్రియుడితో కలసి భర్తను హతమార్చినట్లు తమ విచారనలో తేలిందని కళ్యాణదుర్గం సీఐ శివప్రసాద్, ఎస్‌ఐ శ్రీనివాసులు విలేకరులకు బుధవారం తెలిపారు. గూగుళ్ల రుద్రన్న, భార్య అనిత బతుకుదెరువు కోసం బెంగళూరుకు వలస వెళ్లారు. అక్కడ కర్ణాటకకు చెందిన హనుమంతునిపల్లి వాసి వడ్డే గురుమూర్తితో అనితకు పరిచయం ఏర్పడిందన్నారు. అది వారి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసిందన్నారు.
ఈ విషయం తెలిసి భర్త అనితను తరచూ ప్రశ్నిస్తూ గొడవపడేవారన్నారు. ఎలాగైనా అతని అడ్డు తొలగించుకోవాలనుకున్న ఆమె ప్రియుడితో కలసి అతను తన స్నేహితుడు చెన్నరాయుడుతో కలసి ఫిబ్రవరి 10న మద్యం ఇప్పిస్తామని ఆశ చూపి, రుద్రన్నను ఊరి బయటకు తీసుకెళ్లారు. అక్కడ సదరు వ్యక్తులు బండరాయితో అతని తలపై బాది, హతమార్చి పారిపోయారు. హత్య కేసులో నిందితురాలైన మృతుని భార్య అనిత, ఆమె ప్రియుడు గురుమూర్తి, అతని స్నేహితుడు చెన్నరాయుడును కుందుర్పిలో అరెస్టు చేసినట్లు వివరించారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌కు జడ్జి ఆదేశించారన్నారు.