
ప్రియుడి కోసం భార్య దొంగతనం
ఇద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు
రూ.35 లక్షల సొత్తు స్వాధీనం
పోలీస్ అధికారులకు ఐజీ ప్రశంసలు
నెల్లూరు (క్రైమ్) : తన ప్రియుడితో కలిసి ఒకట్నిర కేజీల బంగారు ఆభణాలను దోపిడీ చేసిన ఘటనలో ఆమెతో పాటు అతన్ని నగర డీఎస్పీ జి. వెంకటరాముడు ఆధ్వర్యంలో ఒకటో నగర పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.35 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు ఉమేష్‌చంద్ర మెమోరియల్ కాన్ఫరెన్స్ హాలులో విలేకరుల సమావేశంలో గుంటూరు రేంజ్ ఐజీ ఎన్.సంజయ్ నిందితుల వివరాలను వెల్లడించారు. నెల్లూరు నగరంలోని శిఖరంవారి వీధిలో ఈ నెల 4వ తేదీ సాయంత్రం రంజిత్‌జైన్ ఇంట్లో సుమారు 1500 గ్రాముల బంగారు ఆభరణాలను ఓ యువకుడు దోచుకెళ్లిన ఘటన తెలిసిందే. ఈ సంఘటన నగరంలో కలకలం రేకెత్తించింది. సంఘటనా స్థలాన్ని నగర డీఎస్పీ జి. వెంకటరాముడు, ఒకటో నగర ఇన్‌చార్జి ఇన్‌స్పెక్టర్ రామకృష్ణారెడ్డి పరిశీలించారు. సంఘటన జరిగిన తీరు, రంజిత్ జైన్ భార్య పూజ చెబుతున్న వివరాలు పొంతనలేకపోవడంతో పోలీసు అధికారులకు అనుమానం వచ్చింది. రంజిత్‌జైన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. డీఎస్పీ ఆధ్వర్యంలో ఒకటో నగర ఇన్‌స్పెక్టర్ ఎస్‌కే అబ్దుల్‌కరీం విచారణ వేగవంతం చేశారు. పూజ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో ఆ కోణంలో కేసు దర్యాప్తు చేపట్టారు.
మిస్టరీ వీడింది ఇలా..
బాధితురాలి ప్రవర్తనపై ఆది నుంచి పోలీసులకు అనుమానం ఉంది. ఆమె గురించి లోతుగా విచారించారు. పూజ రెండు, మూడు సిమ్‌లను వాడుతుందని, రెండు రోజులకొకసారి రూ. 500 వరకు రీచార్జ్ చేయించుకునేదని తెలిసింది. దీంతో కాల్ డిటైల్స్‌ను సేకరించి దాని ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. రాజస్థాన్‌లోని ఇండోర్ సిల్వర్‌నగర్‌కు చెందిన రమీజ్‌షా అనే వ్యక్తికి అనేక సార్లు ఫోన్ చేసినట్లు, సంఘటన జరిగిన రోజు సైతం అనేక సార్లు ఫోన్ చేసినట్లు నిర్ధారించుకున్నారు. విచారణలో పలు విషయాలు వెలుగుచూశాయి. పూజది ఇండోర్. ఆమెకు రమీజ్‌షాతో వివాహేతర సంబంధం ఉంది. భర్త వద్ద నుంచి పారిపోయి వివాహం చేసుకోవాలని వారిద్దరు నిశ్చయించుకున్నారు. అదను కోసం చూస్తుండగా, శంకర్ 1,500 గ్రాముల బంగారాన్ని తమ ఇంట్లో పెట్టడాన్ని పూజ గమనించింది. ఆ బంగారాన్ని కాజేసి ప్రియుడితో పాటు ఉడాయించాలని నిశ్చయించుకుంది. రమీజ్‌షాకు ఫోన్ చేసి నెల్లూరుకు పిలిపించింది. అనంతరం ఇద్దరు కలిసి దోపిడీ పథక రచన చేశారు. మంగళవారం నెల్లూరు రైల్వేస్టేషన్ వద్ద పూజ, ఆమె ప్రియుడు రమీజ్‌షాను పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.35 లక్షలు విలువ చేసే 1,270 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
సిబ్బందికి అభినందనలు
రోజుల వ్యవధిలోనే దోపిడీ ఘటనను ఛేదించిన నగర డీఎస్పీ జి. వెంకటరాముడు, ఒకటో నగర ఇన్‌స్పెక్టర్ ఎస్‌కే అబ్దుల్‌కరీం, ఎస్‌ఐ పి. జిలానిబాషా, హెచ్‌సీలు రఫి, శ్రీనివాసులు, విజయకుమారి, కానిస్టేబుల్స్ పి. శ్రీనివాసులు, దేవకిరణ్, వేణు, వెంకటేశ్వర్లు, రాజు, రమేష్, రామారావు, సురేష్‌ను ఐజీ అభినందించి రివార్డులు ప్రకటించారు. ఈ సమావేశంలో ఎస్పీ విశాల్‌గున్నీ, ఏఎస్పీ బి. శరత్‌బాబు, నగర డీఎస్పీ జి. వెంకటరాముడు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.