
చంద్రబాబూ.. రా కలసి పోరాడదాం
విశాఖ కొవ్వొత్తుల ర్యాలీకి వెళుతున్నా మీరూ రండి..
ఏపీ సీఎంకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పిలుపు
► కాదని అరెస్టు చేస్తారో.. ఇంకేం చేస్తారో మీ ఇష్టం!
► శాంతియుత ప్రదర్శనలపై ఆంక్షలేమిటి?
► ప్రత్యేక హోదాపై అబద్ధాలు ఇకనైనా ఆపండి
► కుంభకోణాల్లో కూరుకుపోయి కేంద్రానికి హోదా తాకట్టు
► లక్షల కోట్ల పెట్టుబడుల ప్రచారం బూటకం
సాక్షి, హైదరాబాద్: ‘‘ప్రత్యేక హోదా కోసం విశాఖపట్టణంలో ఈ నెల 26న సాయంత్రం జరిగే కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనడానికి వెళుతున్నా.. అరెస్టు చేస్తారో.. ఇంకేం చేస్తారో.. మీ విజ్ఞతకే వదలి వేస్తున్నా. ఈ ర్యాలీకి మీరు కూడా రండి కలసి పోరాడదాం’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పిలుపునిచ్చారు. విభజన జరిగేటపుడు పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీపై కేంద్రంతో గట్టిగా పోరాడి సాధించాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ప్రజలు.. ముఖ్యంగా యువత పోరాడుతుంటే అణచివేయాలని చూడడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాకు సంబంధించినవన్నీ ‘ప్రత్యేక ప్యాకేజీ’లో వచ్చేశాయని చంద్రబాబు చెబుతున్నవన్నీ అబద్దాలేనన్నారు.
ప్రత్యేకహోదా కార్యక్రమాలలో పాల్గొనే విద్యార్ధినీవిద్యార్థులపై పీడీ చట్టం ప్రయోగించాలని చంద్రబాబు ఆదేశించడంపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టుపెట్టి రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నందుకు చంద్రబాబుపైనే ‘టాడా’ కింద కేసు నమోదు చేయాలని, ఆయన్నే జైల్లో పెట్టాలని జగన్ వ్యాఖ్యానించారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తర్వాత ఎంపీలందరిచేత రాజీనామా చేయిస్తామని జగన్ స్పష్టంచేశారు. ప్రత్యేక హోదా కోరుతూ శాంతియుత పోరాటానికి సన్నద్ధమవుతున్న విద్యార్థులు, యువకులు, సాధారణ ప్రజలపై రాష్ట్రప్రభుత్వం ఆంక్షలు విధిస్తూ అణచివేతకు పూనుకుంటున్న నేపథ్యంలో జగన్ బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. వివరాలు జగన్ మాటల్లోనే......
ముఖ్యమంత్రే తొక్కేయడం బాధాకరం
‘మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని దేశానికంతటికీ చాటి చెప్పేందుకు ఈనెల 26న రాష్ట్ర ప్రజలంతా సన్నద్ధం అవుతూ ఉంటే కట్టడి చేసేందుకు , ప్రత్యేక హోదాను తొక్కేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే ముందడుగు వేయడం బాధ కలిగిస్తోంది. రాష్ట్రాన్ని విడగొట్టేటపుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చారు. ఆ వాగ్దానాన్ని అమలు చేయండని గట్టిగా ఒత్తిడి తీసుకు రావాల్సిన ముఖ్యమంత్రే స్వయంగా రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూ ఉంటే గుండె తరుక్కు పోతోంది. ప్రత్యేక హోదాలోని అంశాలన్నీ ప్యాకేజీలో వచ్చాయి కాబట్టే హోదా అంశాన్ని వదలి వేశామని చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారు. ప్రత్యేక హోదా ఉంటేనే పారిశ్రామిక రాయితీలు, వంద శాతం ఆదాయపు పన్ను, వంద శాతం ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపు ఉంటాయి. జీఎస్‌టీ నుంచి కూడా మినహాయింపు ఉంటుంది. అలాగే పారిశ్రామికవేత్తలకు రవాణా ఛార్జీలను తిరిగి చెల్లిస్తారు. హోదా వల్ల రాయితీలు వస్తాయి.
రాయితీలుంటేనే పరిశ్రమలొస్తాయి. లక్షల కోట్ల పెట్టుబడులొస్తాయి. లక్షల్లో ఉద్యోగాలొస్తాయి. ఇవన్నీ తెలుసు కాబట్టే ఎన్నికలపుడు చంద్రబాబు ప్రత్యేక హోదా కావాలన్నారు. ఐదేళ్లు సరిపోదు.. 15 ఏళ్లు కావాలని కోరారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ‘బేషరతుగా రైతు రుణ మాఫీ’, ‘డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణమాఫీ’ వంటివి అమలు చేయలేదు. జాబు రావాలంటే బాబు రావాలన్నారు. జాబు ఇవ్వకుంటే ఇంటికి రూ 2,000లు నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. వీటిలో ఏ ఒక్కటీ చంద్రబాబు నెరవేర్చలేదు సరి కదా.. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రానికి తాకట్టు పెట్టేశారు. ఢిల్లీతో పోరాడే ప్రయత్నమే చేయరు. గోదావరి, కృష్ణా నదుల నీళ్లు ఎగువ రాష్ట్రం అటు నుంచి అటే పంపులు పెట్టి, లిఫ్టులు పెట్టి తీసుకు పోతూ ఉంటే గట్టిగా నిలదీయాల్సింది.. అక్కడా మాట్లాడరు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న చంద్రబాబు వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్రప్రయోజనాలను తాకట్టు పెట్టేశారు.
ఇది ప్రజాస్వామ్యమా... బ్రిటిష్ పాలనా?
ప్రత్యేక హోదా సాధన కోసం ప్రతి జిల్లా కేంద్రంలోనూ యువత ముందుకొచ్చి కొవ్వొత్తుల ర్యాలీని శాంతియుతంగా జరపాలని పూనుకుంటే చంద్రబాబు అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటారట. ఏమండీ ఎందుకు జరపకూడదు? ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సిన మీరు పోరాడక పోగా ప్రజలంతా ముందుకొచ్చి అడుగుతూ ఉంటే మీరు ఓర్చుకోలేరా? ఎక్కడైనా ఉద్రిక్తతలుంటాయనుకుంటే 144 సెక్షన్‌ను, 30 సెక్షన్‌ను అమలు చేస్తారు. అసలేమీ జరక్క పోయినా అమలు చేస్తామంటున్నారు. వీడియో కెమెరాలు పెట్టి ర్యాలీలో పాల్గొనే వారిని అంతు చూస్తామని ముఖ్యమంత్రి చెప్పడం ఏమిటి? ఆయన ఆధ్వర్యంలో పని చేసే డీజీపీ చెప్పడం ఏమిటి? అలా అనడానికి డీజీపీ ఎవరసలు? ప్రత్యేక హోదాను ఈ విధంగా నీరు గార్చేందుకు ప్రయత్నించడం ధర్మమేనా? అని గట్టిగా అడుగుతున్నాను. గతంలో కూడా ఇదే అంశంపై బంద్‌లు, ధర్నాలకు పిలుపు నిచ్చినపుడు ముఖ్యమంత్రి దగ్గరుండి మరీ ఆర్టీసీ బస్సులు నడిపించారు.
రాష్ట్రంలో ప్రజలెవ్వరికీ హోదా అవసరం లేదన్న తప్పుడు సంకేతాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. పోలీసులను ఇంత దారుణంగా ఉపయోగించిన ముఖ్యమంత్రి బహుశా బ్రిటిష్ పాలనలో కూడా ఉండిఉండడు. అందుకే బ్రిటిష్ పాలనలో ఉన్నామా? ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అనే సందేహం కలుగుతోంది. చంద్రబాబు వంటి వ్యక్తి స్వాతంత్రోద్యమంలో లేనందుకు ఓ రకంగా సంతోషంగా ఉంది. ఇపుడు ముఖ్యమంత్రిగా ఉండడం మన ఖర్మ. నిజంగా చంద్రబాబు కనుక స్వాంతంత్య్రోద్యమ కాలంలో ఒక నేతగా ఉండి ఉంటే ‘మనకెందుకు స్వాతంత్య్రం? బ్రిటిష్ ప్రభుత్వంతో సఖ్యతగా ఉందాం’ అనేవాడు.
యువతపై పీడీ కేసులు పెడతారా?
యువభేరీల్లో పాల్గొనే యువకులపై పీడీ కేసులు పెట్టాలని చంద్రబాబు ఆదేశిస్తున్నారు. అసలు పీడీ కేసంటే చంద్రబాబుకు తెలుసా అని ప్రశ్నిస్తున్నాను. ఉద్యోగాల కోసం, తమ భవిష్యత్తు కోసం పోరాడే పిల్లలపై పీడీ కేసు పెట్టమని చంద్రబాబు చెబుతారా? నిజానికి స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్న చంద్రబాబుపై టాడా కేసు పెట్టి ముందు ఆయన్నే జైల్లో పెట్టాలి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా శాంతియుతంగా కొవ్వొత్తులతో జరుగబోయే ర్యాలీని ప్రశాంతంగా జరగనివ్వాలని, అడ్డుకోరాదని చంద్రబాబును డిమాండ్ చేస్తున్నా.
మా పోరాటం ఆగదు..
ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి 32 సార్లు పోరాటం చేసింది. హోదా వల్ల ప్రయోజనాలేమిటి? హోదాపై ఎవరెలాంటి అబద్ధాలు చెబుతున్నారనే వివరణతో కూడిన కరపత్రాన్ని వైఎస్సార్ కాంగ్రెస్‌కు సంబంధించిన అన్ని వెబ్‌సైట్లలో ఉంచాం. 26వ తేదీ నాటి కొవ్వొత్తుల ర్యాలీని మినహాయించినా కూడా 32 సార్లు పోరాటం చేసిన వివరాలున్నాయి. ఈ పోరాటం ఇంతటితో ఆగదు. చేస్తూ పోతాం. జల్లికట్టు తమిళులకు ఒక ఆట దాని కోసం తమిళులంతా ఒక్కటయ్యారు. మనకు ప్రత్యేక హోదా అనేది జీవన్మరణ సమస్య. అలాంటి దాని కోసం చంద్రబాబు చేయలేక పోవడం సిగ్గుతో తలవంచుకోవాలి.’’ అని జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. శాసనమండలిలో వైఎస్సార్ కాంగ్రెస్ పక్షం నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పీఏసీ సభ్యుడు జి.ఆదిశేషగిరిరావు, జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పార్టీ నేతలు ఎంవిఎస్ నాగిరెడ్డి, సాగి దుర్గాప్రసాదరాజు తదితరులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.
నేనే వెళ్తా విశాఖ.. అరెస్టు చేస్తారా?
ఇంకో విషయం చెబుతున్నా. విశాఖపట్టణంలో ర్యాలీకి నేను వెళుతున్నా. అరెస్టు చేస్తాం, ఇంకొకటి చేస్తాం అంటే మీ ఇష్టానికే వదిలేస్తున్నా. గురువారం సాయంత్రం నేను విశాఖకు వెళ్లి కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొంటానని గట్టిగా చెబుతున్నా. అరెస్టు చేస్తామటే చేయండి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు శాంతియుతంగా ప్రజాస్వామ్య యుతంగా ర్యాలీ చేయడానికి పోతూ ఉంటే అరెస్టు చేస్తాం, ఇంకొకటి చేస్తామంటే అది మీ విజ్ఞతకే వదలి వేస్తున్నా. నేనైతే అక్కడకు పోతున్నా. కచ్చితంగా పాల్గొంటానని చంద్రబాబుకు చెబుతున్నాను.
బాబుకు జ్ఞానోదయమై ర్యాలీకి రావాలి
చంద్రబాబుకు జ్ఞానోదయం కావాలని, ఆయన కూడా తన వైఖరిని మార్చుకుని ప్రత్యేక హోదాకు మద్దతుగా కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనాలని కోరుతున్నా. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని, అబద్ధాలు చెప్పవద్దని కోరుతున్నా. రాష్ట్ర ప్రయోజనాల కోసం తోడుగా నిలబడండి అని మనస్ఫూర్తిగా కోరుతున్నా. హోదా కోసం ఎవరు ఏ కార్యక్రమం చేసినా మేం మద్దతిస్తామని చెబుతున్నా. ఇది ఒక్క జగన్‌తో సాధ్యమయ్యేది కాదు, అందరూ కలిసికట్టుగా వస్తేనే సాధ్యమవుతుంది.
ఎంపీలతో రాజీనామాలు చేయిద్దాం..
ప్రత్యేక హోదా కోసం అందరమూ కలిసి ఢిల్లీకి పోదాం, నేను కూడా చంద్రబాబుతో కలిసి వస్తా... ఢిల్లీ వాళ్లు ఒప్పుకోక పోతే అందరం మన 25 ఎంపీలతో∙రాజీనామాలు చేయిద్దాం. ప్రత్యేక హోదాపై ఎన్నికలకు పోదాం. దేశం మొత్తం చూసే విధంగా ఏపీ ప్రజలు ప్రత్యేక హోదా కోసం ఆరాటపడుతున్నారని తెలిసే విధంగా ప్రత్యేక హోదాపైనే ఎన్నికలకు పోదాం. చంద్రబాబు విన్నా వినక పోయినా , సహకరించినా సహకరించక పోయినా హోదా కోసం మా పోరు ఆగదు. ఈ ఏడాది మే, జూన్ నెల కల్లా కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ మూడేళ్ల పరిపాలన పూర్తవుతుంది. బడ్జెట్ సమావేశాల తరువాత ప్రత్యేక హోదా కోసం మా పార్టీ ఎంపీలందరితో రాజీనామాలు చేయిస్తాం. దేశం మొత్తం చూసేలా ఉప ఎన్నికలకు పోదాం. పార్లమెంటులో ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయడం లేదో దేశమంతా ఆలోచించాలి. చంద్రబాబు కూడా సహకరిస్తే సంతోషిస్తాం. మాకు తోడుగా రాకపోతే రాబోయే రోజుల్లో చంద్రబాబును ప్రజలు బంగాళాఖాతంలో తోసేస్తారు. దేవుడు మొట్టికాయలు వేస్తారు.