స్నేహితుల ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి
-
సినీ, మిమిక్రీ నటుడు శివారెడ్డి
మందమర్రి : స్నేహితులు తనలో ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంతోనే ఈస్థాయికి చేరుకున్నానని ప్రముఖ సినీ నటుడు, మిమిక్రీ కళాకారుడు శివారెడ్డి అన్నారు. బుధవారం స్థానిక ఇందు గార్డెన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నతనంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నానని, కష్టాల్లో వెన్నంటే ఉన్న స్నేహితులను ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటానని తెలిపారు. రానున్న కాలంలో పేదలకు సేవ చేసేలా ట్రస్టును ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. కొడుకుల నిరాధారణకు గురైన తల్లులకు అండగా ఉండాలనేది బలమైన సంకల్పమని పేర్కొన్నారు. కోల్‌బెల్ట్‌లోని కళాకారులకు తన వంతు సహయం తప్పకుండా ఉంటుందని స్పష్టం చేశారు. సమావేశంలో టీఆర్‌ఎస్ నాయకులు బండి సదానందం, నోముల ఎల్లాగౌడ్, బండి ప్రభాకర్, వాసు పాల్గొన్నారు.
సినీ నటుడు శివారెడ్డి పూజలు
మంచిర్యాల టౌన్ : మంచిర్యాల పట్టణంలోని హైటెక్‌సిటీ గణేష్ మండలి వద్ద సినీ నటుడు శివారెడ్డి బుధవారం సాయంత్రం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మంచిర్యాలతో తనకు ఎనలేని అనుబంధం ఉందన్నారు. నా ఎదుగుదలకు ప్రేక్షకులు, ఇక్కడి ప్రజలే కారణమని తెలిపారు. అనంతరం తన మిమిక్రీతో భక్తులను ఆనందపరిచారు. హైటెక్‌సిటీ గణేష్ మండలి సభ్యులు శివారెడ్డిని ఘనంగా సత్కరించారు.