వాటర్ ట్యాంక్‌లో మహిళ మృతదేహం
- హత్యనా? ఆత్మహత్యనా?
- ఆలస్యంగా వెలుగులోకి
- ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ
కర్నూలు: కర్నూలు నగరం టీచర్స్ కాలనీలో బుధవారం.. ఓ మహిళ మృతదేహం వాటర్ ట్యాంక్‌లో కనిపించింది. మృతదేహం గుర్తు పట్టని విధంగా ఉంది. హత్య జరిగిందా..ఆత్మహత్యనా అనే విషయాలు తెలియరాలేదు. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన వివరాలు ఇవీ.. నగరంలోని టీచర్స్ కాలనీలో (తనిష్క్ కన్వెన్షన్ హాల్ ఎదురుగా) బల్వారి అపార్టుమెంటు ఉంది. ఫ్లోరుకు రెండు ప్లాట్ల ప్రకారం నాలుగు ఫ్లోర్లలో 8 కుటుంబాలు ఇందులో నివాసం ఉంటున్నాయి. చివరి అంతస్తులో పెంటౌస్, రెండు వాటర్ ట్యాంకులు ఉన్నాయి. ఇందులో బోరు నీళ్లకు సంబంధించిన ట్యాంకు మాత్రమే అపార్టుమెంటు వాసులు ఉపయోగిస్తున్నారు. మున్సిపల్ వాటర్ కనెక్షన్‌కు సంబంధించి మరో ట్యాంకు ఏర్పాటు చేసినప్పటికీ నాలుగు నెలలుగా నిరుపయోగంగా ఉంది.
ట్యాంకును శుభ్రం చేసి కొళాయి కనెక్షన్ తీసుకునేందుకు బుధవారం ఉదయం అపార్టుమెంటు నిర్వాహకులు ట్యాంకును ఓపెన్ చేయగా అందులో మహిళ మృతదేహం బయటపడింది. సుమారు 30 సంవత్సరాల వయస్సు ఉండి, మృతదేహం కుళ్లిపోయి పురుగులు పట్టి ఉంది. గుర్తుపట్టని విధంగా ఉండటంతో, అందులో నివాసం ఉన్న ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ నాగేంద్ర.. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఎస్పీ ఆకె రవికృష్ణ మధ్యాహ్నం సంఘటన స్థలానికి వెళ్లి పరిసరాలను పరిశీలించారు. ఇన్‌చార్జి డీఎస్పీ మురళీధర్, రెండో పట్టణ ఇన్‌చార్జి సీఐ మహేశ్వరరెడ్డి, ఎస్‌ఐలు ఖాజావలీ, మోహన్ కిషోర్, చంద్రశేఖర్ తదితరులు ఎస్పీ వెంట ఉన్నారు. హత్య చేసి నీళ్ల ట్యాంకులో పడవేసి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.
మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు పోలీసులు.. స్థానిక డాక్టర్లను సంప్రదించగా, కాలాతీతమైనందున గురువారానికి వాయిదా వేశారు. మృతదేహానికి పురుగులు పట్టి ఎముకలు తేలి ఉన్నాయి. మృతదేహానికి గాయాలు ఉన్నాయా? లేదా అన్న విషయం పోస్టుమార్టం నివేదికలో తేలాల్సి ఉంది. ఎస్పీ ఆదేశాల మేరకు రెండు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. గత మూడు నెలల కాలంలో చుట్టుముట్టు కాలనీలో ఉన్న మహిళలు ఎవరైనా అదృశ్యమయ్యారా అనే కోణంలో విచారిస్తున్నారు. తప్పిపోయిన మహిళా బాధితులు ఎవరైనా ఉంటే స్థానిక పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాలని పోలీసులు సూచిస్తున్నారు. కర్నూలు వీఆర్‌ఓ మద్దిలేటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని హత్యనా, ఆత్మహత్యనా అన్న కోణంలో విచారణ జరుపుతున్నామని ఇన్‌చార్జి సీఐ మహేశ్వరరెడ్డి తెలిపారు.