కదిరి టౌన్ : కదిరి ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలోనే గురువారం ఓ మహిళ ప్రసవించింది. వివరాలిలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా వాయలపాడులోని రామయ్యకాలనీకి చెందిన జ్యోతి కుటుంబ సభ్యులతో కలిసి ఓ పని నిమిత్తం కదిరికి వచ్చారు. గురువారం స్వగ్రామానికి వెళ్లేందుకు కదిరి ఆర్టీసీ బస్టాండుకు చేరుకున్నారు. జ్యోతికి ఉన్నఫలంగా పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారమిచ్చారు. పైలట్ మహబూబ్‌బాషా, ఈఎంటీ లక్ష్మినారాయణ, ఆ సమయంలో అక్కడే అందుబాటులో ఉన్న మలేరియా నివారణ యూనిట్ సూపర్‌వైజర్ మహబూబ్‌బాషా వెంటనే అక్కడికి చేరుకున్నారు. వాహనంలోకి చేర్చేలోపే బస్టాండు ప్రాంగణంలోనే ఆమె మగశిశువుకు జన్మనిచ్చింది. తర్వాత తల్లీబిడ్డను సురక్షితంగా స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి చేర్చారు.