రామచంద్రపురం(తూర్పుగోదావరి జిల్లా): అధిక వడ్డీలు వేసి, ఇచ్చిన అప్పు వెంటనే తీర్చాలని, లేకుంటే విలువైన స్థలం లాక్కుంటామని బెదిరించడమే కాకుండా, తనను లైంగిక వేధింపులకు గురి చేశారని ఒక మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలు, రామచంద్రపురం పోలీసుల తెలిపిన కథనం ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం పట్టణానికి చెందిన కృష్ణవేణి భర్త అప్పారావు ఉద్యోగరీత్యా విదేశాల్లో ఉంటున్నారు. ఆర్థిక ఇబ్బందుల రీత్యా 2010లో కుతుకులూరుకు చెందిన నల్లమిల్లి వీర్రెడ్డి నుంచి రూ.2 లక్షల అప్పు తీసుకున్నారు. ఇందుకోసం కత్తిపూడిలో ఉన్న స్థలం అస్వాధీన తనఖా పెట్టాలని షరతు విధించడంతో, దానికి సమ్మతించారు.
ఈ నేపథ్యంలో రామచంద్రపురంలోని ఆమె తండ్రి ఇంటికి వీర్రెడ్డి, సత్తి శ్రీనివాసరెడ్డి, పులగం వీఆర్‌జీ కృష్ణారెడ్డి, సత్యనారాయణరెడ్డి, నల్లమిల్లి జనార్దనరెడ్డి వచ్చి ఆమె, భర్త అప్పారావు, వారి బంధువుల వద్ద కలిపి మొత్తం 10 ఖాళీ చెక్కులు, 10 ఖాళీ ప్రామిసరీ నోట్లు, 10 కాంటస్సా పేపర్లపై సంతకాలు తీసుకున్నారు. స్థలం ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకుని 2010 జూన్‌లో తుని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం వద్దకు అస్వాధీన తనఖా చేసుకునేందుకు పిలిపించారు. అయితే అస్వాధీన తనఖా కాకుండా కాగితాలను మార్చి పవర్ ఆఫ్ పట్టాగా రాయించుకున్నారని, దీనిపై అడగ్గా ఎటువంటి సమస్యా ఉండదని వీర్రెడ్డి నమ్మబలికారని కృష్ణవేణి చెప్పింది. నెలనెలా వడ్డీలు కడుతున్నా, రూ.40 లక్షలు వెంటనే కట్టాలని, లేకుంటే స్థలం స్వాధీనం చేసుకుని, వేరేవారికి అమ్ముతామంటూ బెదిరించారని వివరించింది. ఈ క్రమంలో నిందితులు అయిదుగురూ తన తండ్రిని, తనను దుర్భాషలాడి వేధించడం ప్రారంభించారన్నారు.
తాము మోసపోయమని తెలుసుకుని వారి నుంచి బయటపడే ఉద్దేశ్యంతో విశాఖ జిల్లా గాజువాకలో ఉన్న ఇంటిపై అప్పు తీసుకుని రూ.17 లక్షల సెటిల్‌మెంట్‌కు వెళ్లగా రూ.12 లక్షలు తీసుకుని కొన్ని కాగితాలు మాత్రమే ఇచ్చారని, మిగిలినవి ఇవ్వలేదని, భూమి తనఖా రద్దు చేయలేదని కృష్ణవేణి చెప్పింది. మిగిలిన కాగితాలు ఇస్తామని చెప్పి సోమేశ్వరం గ్రామ శివార్లలోని లక్ష్మీగణపతి రైస్‌మిల్లు వద్దకు రమ్మని పిలిచి కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి లైంగిక దాడికి యత్నించటమే కాకుండా దానిని వీడియో తీశారని, యూట్యూబ్, సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరిస్తున్నారని ఆమె వాపోయింది. బలవంతంగా అక్కడి నుంచి బయటపడినా వీడియోలతో భయపెడుతున్నారని విలపించింది.
అప్పటి నుంచీ లైంగిక వేధింపులకు గురి చేయటం మొదలెట్టారని చెప్పింది. ఈ మేరకు గత ఏడాది డిసెంబర్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, చివరకు హైకోర్టును ఆశ్రయించానని వివరించింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు శనివారం కేసు నమోదు చేశారని తెలిపింది. పోలీసు ఉన్నతాధికారులు తనను కాపాడాలని, నిందితుల వద్ద ఉన్న వీడియోలు స్వాధీనం చేసుకోవాలని, అవి బయట పడితే తనకు చావు తప్ప వేరే శరణ్యం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై బాధితురాలి ఫిర్యాదు, కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసినట్లు రామచంద్రపురం ఎస్సై ఎల్. శ్రీను నాయక్ తెలిపారు.
మహిళకు కాల్‌మనీ వేధింపులు
Published Sun, May 22 2016 10:13 PM | Last Updated on Mon, Sep 4 2017 12:41 AM
Advertisement
Advertisement