
తొక్కిసలాటలో మహిళకు గాయాలు
బద్వేలు అర్బన్:నియోజకవర్గంలోనే అత్యధిక లావాదేవీలు నిర్వహించే బద్వేలు పట్టణంలోని ఎస్‌బీఐ మెయిన్‌బ్రాంచ్ వద్దకు ప్రతిరోజూ జనం భారీగా తరలివస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రజలు బ్యాంక్‌లోకి దూసుకెళ్తుండడంతో తోపులాట జరుగుతోంది. రెండు రోజుల క్రితం తీవ్ర తోపులాట జరిగి ఐదుగురు వృద్ధులు సొమ్మసిల్లి పడిపోయారు. బుధవారం కూడా బ్యాంక్ వద్ద తీవ్ర తోపులాట జరిగింది. బద్వేలు మండలం వీరపల్లె పంచాయతీలోని సిద్దుగారిపల్లె గ్రామానికి చెందిన మన్యం సుబ్బమ్మ (40) తోపులాటలో కిందపడి గాయపడింది. మెయిన్ గేటు నుంచి బ్యాంకు ప్రధాన ద్వారం లోకి వెళ్లే క్రమంలో సుబ్బమ్మ కిందపడడంతో ఆమెపైనే మరికొంతమంది మహిళలు పడ్డారు. దీంతో ఆమె నడుముభాగంలో , మోకాలిభాగంలో గాయాలై నడవలేని స్థితిలో సొమ్మసిల్లిపడిపోయింది. వెంటనే ఆమె కుటుంబ సభ్యులు బ్యాంక్ వద్దకు చేరుకుని 108 సహాయంతో ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ నుంచి కడప రిమ్స్‌కు తరలించారు.