పుట్లూరు (అనంతపురం): పొలంలో ఒంటరిగా ఉన్న వృద్ధురాలి మెడలో గొలుసును తెంపుకుపోయారు దుండగులు. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం కొమ్మిడికుంట్ల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రంగమ్మ(65) మంగళవారం సాయంత్రం తన పొలంలో పనులు చేసుకుంటుండగా గుర్తుతెలియని ఇద్దరు దుండగులు ఆమె వద్దకు వచ్చారు. ఏదో మాట్లాడుతున్నట్లు నటిస్తూనే ఆమె తలపై దుప్పటి ముసుగేసి కట్టి, మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసును తెంపుకుని తాము వచ్చిన బైక్‌పై పారిపోయారు. ఆ సమయంలో చుట్టుపక్కల పొలాల్లో ఎవరూ లేకపోవటంతో రంగమ్మ నిస్సహాయురాలై ఉండిపోయింది. అనంతరం ఇంటికి చేరుకుని కుటుంబసభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.