ఇదేనా..మహిళా సాధికారత | women empowerment is this | Sakshi
Sakshi News home page

ఇదేనా..మహిళా సాధికారత

Published Sun, Feb 12 2017 1:29 AM | Last Updated on Tue, Sep 5 2017 3:28 AM

women empowerment is this

సాక్షి ప్రతినిధి, ఏలూరు : ‘తెలుగుదేశం ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు. మహిళా సాధికార సదస్సుకు ఎమ్మెల్యే ఆర్‌కే రోజాను ఆహ్వానించిన ప్రభుత్వం.. ఆమెను తీవ్రంగా అవమానించడం దారుణం. ఈ ఘటనతో ప్రభుత్వ తీరు ఏమిటో స్పష్టమైంది. రోజాతో పోలీసులు వ్యవహరించిన తీరు మహిళలపై చంద్రబాబు నాయుడి ప్రభుత్వానికి ఉన్న చిన్నచూపునకు తార్కాణంగా మిగిలింది’ అంటూ మహిళా లోకం సర్కారుపై దుమ్మెత్తి పోసింది. మహిళా సాధికార సదస్సుకు బయలుదేరిన రోజాను గన్నవరం విమానాశ్రయంలోనే నిలువరించడం.. ఆ తరువాత జిల్లాలు మారుస్తూ తీసుకెళ్లడంపై వైఎస్సార్‌ సీపీ నాయకులతోపాటు విపక్షాలు, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు, మేధావులు తీవ్రస్థాయిలో విరచుకుపడ్డారు. వీరంతా ప్రభు త్వ వైఖరిని ముక్తకంఠంతో ఖండించారు. నిడదవోలు మునిసిపాలిటీలో వైఎస్సార్‌ సీపీ ఫ్లోర్‌ లీడర్‌ పువ్వల రతీదేవి ఆధ్వర్యంలో వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్లు, మహిళలు ప్రభుత్వ తీరుకు నిరసనగా శనివారం ఆందోళన చేపట్టారు.  
 
మహిళలపై పెచ్చుమీరిన దాడులు
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలపై దాడులు పెరిగిపోయాయి. మన జిల్లానే తీసుకుంటే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ముసునూరు తహసీల్దార్‌ వనజాక్షిపై దౌర్జన్యం చేసినా చంద్రబాబు పట్టించుకోలేదు. ఆక్వా ఫుడ్‌పార్క్‌కు వ్యతిరేకంగా పోరాడినందుకు ఆరేటి సత్యవతిని 40 రోజులకు పైగా జైలులో పెట్టిన ప్రభుత్వ దమన నీతి అందరికీ తెలిసిందే. తన అక్కను వెంటాడి వేధించి మరీ చంపారని నరసాపురం పట్టణానికి చెందిన పావని మొత్తుకున్నా అధికార పార్టీ నేతను కాపాడేందుకు శ్రీగౌతమి కేసును ఏ విధంగా నీరుగార్చారో జిల్లా ప్రజలకు తెలుసు. ఒక దళిత మహిళను మంత్రిగా చేసినా మూ డేళ్లలో ఒక్కసారి కూడా ఆగస్టు 15న జెండా ఆవిష్కరణ చేసే అవకాశం ఇవ్వలేదు.
 
ప్రభుత్వ తీరు అప్రజాస్వామికం
ఎమ్మెల్యే రోజా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు అప్రజాస్వామికం. సదస్సుకు ఆహ్వానించి ఎయిర్‌ పోర్టులోనే ఆమెను నిర్బంధించడం రాజ్యాంగ విరుద్ధం. మహిళ ప్రశ్నిస్తే ప్రభుత్వం కూలిపోతుందేమోననే భయం టీడీపీకి పట్టుకుంది. ప్రభుత్వమే ఒక నాయకురాలిని కిడ్నాప్‌ చేయడం ఎప్పుడూ లేదు. 
– పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
 
లోకేష్‌ భార్యను ఎలా మాట్లాడించారు
మహిళా పార్లమెంట్‌ నిర్వహిస్తూ మహిళా ఎమ్మెల్యే ఆర్‌కే రోజా పట్ల అంత అమానుషంగా వ్యవహరించటం సమాజం తలదించుకునేలా ఉంది. సీఎం చంద్రబాబు లోకేష్‌ భార్యతో ఎలా మాట్లాడించారు. బృందాకారత్‌ను ఎందుకు ఆహ్వానించలేదు. కేవలం ఒక పార్టీ సదస్సులా నిర్వహించాలనుకోటం దారుణం. రోజా విషయంలో ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరుపై మహిళలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
– వి.కనకదుర్గ, యూటీఎఫ్‌ జిల్లా మహిళా కన్వీనర్‌
 
సిగ్గులేని ప్రభుత్వం
సిగ్గులేని ప్రభుత్వమిది. రాష్ట్రంలో మహిళా అధికారులు, మహిళా ప్రజాప్రతినిధులపైనే ఇలా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటే ఇక సామాన్య మహిళల విషయంలో టీడీపీ నాయకుల తీరు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి.  
– ఎండీ అమర్‌జహాబేగ్, కాంగ్రెస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
 
మహిళలపై ప్రభుత్వ తీరుకు నిదర్శనం
మíహిళా సమస్యలపై పోరాటం చేస్తున్న  నాయకులను సదస్సుకు ఆహ్వానించలేదు. ప్రతిపక్ష ఎమ్మెల్యే రోజాతో ఈ ప్రభుత్వం ప్రవర్తించిన తీరును ఖండిస్తున్నాం. పార్టీలకు అతీతంగా మహిళా సమస్యలు తెలుసుకునేందుకు నిర్వహించిన ఈ సదస్సుకు మహిళా ఎమ్మెల్యేను పిలిచి అవమానించటం దారుణం. 
– సీహెచ్‌ రాజ్యలక్ష్మి, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement