- బి.బంజేరుపల్లి గ్రామస్తులు ఆవేదన
తొగుట: కొమురవెల్లి మల్లన్న సాగర్ నిర్మాణానికి తమ గ్రామంతోపాటు వ్యవసాయ భూములు అప్పగించి నెలలు గడుస్తున్నా అధికారులు పరిహారం చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని బీ. బంజేరుపల్లి గ్రామస్తులు ఆరోపించారు. బుధవారం గ్రామంలో వారు మాట్లాడుతూ ఇళ్లు సర్వేచేసి నెలలు గడుస్తున్నా నష్టపరిహారం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
భూములు, ఇళ్ల పరిహారం కోసం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా అధికారులు స్పందించడం లేదని ఆరోపించారు. భూములు ఇచ్చేంత వరకు ప్రజల చుట్టూ తిరిగిన అధికారులు నేడు ఒకరిని అడిగితే మరొకరి పేరుచెప్పి తప్పించుకుంటున్నారని వాపోయారు. సకాలంలో తమ చేతికి డబ్బులు అందితే తాము మరోచోట భూములు కొనుగోలు చేసుకుంటామని తెలిపారు.
అధికారుల నిర్లక్ష్యం మూలంగా తాము అన్ని విధాలుగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. పరిహారం కోసం స్థానిక తహసీల్దార్‌ను సంప్రదిస్తే రేపుమాపు అంటూ తప్పించుకుంటున్నాడని గ్రామస్తులు విమర్శించారు. చెప్పులరిగేలా తిరిగినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.
ఇళ్ల పరిహారం కోసం తాము రాస్తారోకో చేసిన సమయంలో వారం రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని చెప్పిన అధికారులు నెల రోజులు గడిచినా స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించకుంటే ఆందోళన కార్యక్రమం చేపడతామని గ్రామస్తులు హెచ్చరించారు.