సర్కారు స్కూళ్ల పటిష్టతకు కృషి | work for government schools development | Sakshi
Sakshi News home page

సర్కారు స్కూళ్ల పటిష్టతకు కృషి

Published Thu, Sep 8 2016 12:19 AM | Last Updated on Mon, Sep 4 2017 12:33 PM

సర్కారు స్కూళ్ల పటిష్టతకు కృషి

సర్కారు స్కూళ్ల పటిష్టతకు కృషి

– కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌ 
– సమస్యలుంటే వాట్సప్‌లో తెలియజేయాలని హెచ్‌ఎంలకు సూచన
– 79 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం
 
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): సర్కారు స్కూళ్లను పటిష్టం చేసి పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు కృషి చేస్తామని కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌ అన్నారు. ప్రధానోపాధ్యాయులంతా గ్రూపుగా ఏర్పడి స్కూళ్లలో నెలకొన్న సమస్యలను వాట్సప్‌ ద్వారా తన దృష్టికి తెస్తే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఒక్క రోజులోనే ప్రధానోపాధ్యాయుల గ్రూపును ఏర్పాటు చేయాలని డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డిని ఆదేశించారు. ఉపాధ్యాయులు వృత్తి నైపుణ్యాలు వృద్ధిచేసుకుని పేద విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని పురస్కరించుకుని బుధవారం కలెక్టరేట్‌ సునయన ఆడిటోరియంలో జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 79 మందిని ఘనంగా సత్కరించారు.  ఇందులో పాఠశాల విద్యలో 62 మంది ఉపాధ్యాయులు, ఇంటర్‌ విభాగంలో 17 మంది అధ్యాపకులు ఉన్నారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్, డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి, రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ గేయానంద్, ఎస్‌ఎస్‌ఏ పీఓ రామచంద్రారెడ్డి, సీపీఓ ఆనంద్‌నాయక్‌ తదితరులు అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ..ప్రభుత్వ విభాగంలోని ఐఐటీ, ఎన్‌ఐటీ, మెడికల్, ఐఐఐటీ తదితర సంస్థల ప్రవేశాలకు విపరీతమైన పోటీ నెలకొందన్నారు. అయితే అదే ప్రభుత్వ ఆధీనంలోని పాఠశాలలు, కళాశాలల్లో ప్రవేశాలు లేక అల్లాడిపోతున్నాయన్నారు. ఇలా ఎందుకు జరుగుతుందోనని ఆలోచన చేయాల్సిన అవసరం ఉపాధ్యాయులపై ఉందన్నారు.
 
టీచర్స్‌ హోం ఏర్పాటుకు కృషి :టీజీ
జిల్లా కేంద్రంలో ప్రభుత్వం స్థలం చూపితే టీచర్స్‌ హోంను రాజ్యసభ నిధుల నుంచి నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నానని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ పేర్కొన్నారు. వచ్చే ఉపాధ్యాయ దినోత్సవాన్ని అందులోనే నిర్వహించవచ్చన్నారు. అలాగే పెద్ద ఎత్తున ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహించేందుకు హైదరాబాద్‌లోని రవీంద్రభారతి నమూనాలో ఓ కన్వెన్షన్‌ హాల్‌ నిర్మించేందుకు నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు ఉపాధ్యాయులు తమపై వచ్చిన మచ్చను పొగుట్టుకొనుటకు తీవ్రంగా కషి చేయాల్సి ఉందని టీజీ సూచించారు. నైతిక విలువలతో కూడిన విద్యను అందించాల్సి బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. 
 
జిల్లాలో 2వేల ఉపాధ్యాయ పోస్టుల ఖాళీ
 జిల్లాలోని ఉపాధ్యాయులు అత్యుత్తమ బోధన చేస్తున్నారని, వారి కషితోనే పది, ఇంటర్‌ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు వస్తున్నాయని డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. అయితే, జిల్లాలో 2 వేల పోస్టులు ఖాళీగా ఉండడంతో  కొన్ని పాఠశాలల్లో  బోధనకు ఇబ్బందిగా మారిందని చెప్పారు. ప్రజా ప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వాటి భర్తీకి చర్యలు తీసుకుంటే మరింతగా పనిచేసేందుకు ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నారని ఆయన భరోసా ఇచ్చారు. మరోవైపు ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయాలని అసెంబ్లీలో ప్రశ్నిస్తానని ఎమ్మెల్సీ గేయానంద్‌ తెలిపారు. తనకు జిల్లాలోని ప్రజా ప్రతినిధులు సాయంగా పోరాటానికి రావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో డీవైఈఓలు తహెరాసుల్తానా, శివరాముడు, పి.మౌలాలి, ఏడీ అనురాధ, డిప్యూటీ డీవీఈఓ వెంకటరావు, డీసీఈబీ కార్యదర్శి ఓంకార్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement