భూగర్భ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేస్తున్న మేయర్ తదితరులు
జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్
రామచంద్రాపురం: హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. గురువారం ఆయన రామచంద్రాపురంలోని భారతీనగర్ డివిజన్‌లో రూ.70లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఎంఐజీ కాలనీలో పలు ఆభివృద్ధి కార్యక్రమలను ప్రారంభించారు. అక్కడ నుంచి విద్యుత్‌నగర్‌లో భూగర్భ డ్రైనేజీ పనులకు శంకుస్ధాపన చేశారు.
పట్టణంలోని నాగులమ్మ దేవలయం వద్ద జాతీయ రహదారిని పరిశీలించారు. అనంతరం కార్పొరేటర్ వెన్నవరం సింధు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నగరాన్ని అభివృద్ది బాటలో నడుపుతున్నామన్నారు. ప్రధానంగా ముఖ్య మంత్రి కేసీఆర్ హైదరాబాద్ నగరంలోని ప్రధాన సమస్యలను పరిష్కరించండంలో ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నగరాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు.
రానున్న రోజుల్లో హైదరాబాద్ నగరంలో మంచినీటి సమస్య లేకుండా చేసే విధంగా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. అలాగే ప్రతి కార్పొరేటర్‌కు రూ.మూడు కోట్లు ఇస్తున్నట్టు తెలిపారు. వర్షాలు పడితే నగర రోడ్లపై నీళ్లు వస్తున్నాయని దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నాలాల పరిరక్షణకు నడుం బిగించిందన్నారు.
నగరంలో నాలను కబ్జా చేసి కట్టిన కట్టడాల కూల్చివేత కార్యక్రమం కొనసాగుతుందన్నారు. దీని వల్ల కొందరికి నష్టం జరిగుతున్న ప్రజలకు ఎంతో మేలు జరిగిందని వివరించారు. రామచంద్రాపురం పట్టణంలో చిన్నిపాటి వర్షానికే జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున నీరు చేరుతోందనే విషయం సంబంధిత కార్పోరేటర్లు తన దృష్టికి తెచ్చారని తెలిపారు.
అందులో బాగంగా నాగులమ్మ గుడి సమీపంలోని రోడ్డును స్వయంగా పరిశీలించానన్నారు. ఈ సమస్యను వీలైనంత త్వరలో పరిష్కరిస్తారని హామి ఇచ్చారు. మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు జాతీయ రహాదారిపై ఉన్న నాలాలపై బాక్స్ కల్వర్టులు నిర్మించేందుకు నిధులు మంజూరయ్యాయన్నారు.
విద్యుత్ నగర్‌లో డ్రైనేజీ ట్రీట్ మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు మేయర్‌ను కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్‌రెడ్డి, గాంధీ, ఎమ్మెల్సీ వి. భూపాల్‌రెడ్డి, కార్పోరేటర్‌లు సింధు, తొంట అంజయ్య యాదవ్, నాగేందర్ యాదవ్, రాష్ర్ట సర్పంచ్‌ల పోరం ఆధ్యక్షుడు మల్లేపలి సోమిరెడ్డి, నాయకులు పుష్పనాగేశ్ యాదవ్ తదితరులు ఉన్నారు.