కోటిలింగాల రేవులో శవమై తేలిన చైతన్య
వేదసమాజం వీధిలో అలముకున్న విషాదఛాయలు
శోకసంద్రంలో మునిగిన కుటుంబ సభ్యులు
సాలూరు : రాజమహేంద్రవరంలోని గోదావరి నది కోటిలింగాల రేవుకు స్నానానికి వెళ్లి గల్లంతైన సాలూరు యువకుడు సిగడాపు చైతన్య (19) మరణించాడు. రాజమహేంద్రవరంలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న చైతన్య గురువారం తన స్నేహితులతో కలసి స్నానానికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఐదుగురిలో ఇద్దరు నదిలో గల్లంతు కాగా ముగ్గురు క్షేమంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు గజ ఈతగాళ్ల సాయంతో గురువారం సాయంత్రం ఆరు గంటల వరకు గాలించారు. మరలా శుక్రవారం ఉదయం నదిలో గాలింపు చర్యలు ప్రారంభించగా చైతన్య మతదేహం లభ్యమైంది. దీంతో నదిలో కొట్టుకుపోయిన తమ బిడ్డ, ఎక్కడో ఒకచోట క్షేమంగా ఒడ్డుకు చేరుకుని ఉంటాడన్న తల్లిదండ్రుల ఆశలు అడియాశలయ్యాయి.
– విషాద ఛాయలు
చైతన్య మతి వార్త తెలియడంతో స్థానిక వేదసమాజం వీధిలో విషాదఛాయలు అలముకున్నాయి. విషయం తెలుసుకున్న చైతన్య బంధువులు, స్నేహితులు అధిక సంఖ్యలో అతని ఇంటికి చేరుకున్నారు. చైతన్య పెదనాన్న బంగారయ్య, తదితరులు రాజమహేంద్రవరంకు చేరుకుని మతదేహాన్ని సాలూరు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేసారు.
తల్లికి తెలియకుండా..
బిడ్డ చనిపోయిన విషయం తల్లి శ్రీదేవికి తెలియకుండా బంధువులు జాగ్రత్తపడ్డారు. పరామర్శకు ఇంటికి వస్తున్న వారితో తన బిడ్డకు ఏమీకాకుండా దేవుడిని ప్రార్థించండి అంటూ శ్రీదేవి చెబుతుండడంతో ప్రతి ఒక్కరూ కన్నీటిపర్యంతమవుతున్నారు. విషయం తెలిస్తే తన భార్య ఏమైపోతుందోనని సూర్యనారాయణ భయపడుతున్నాడు.