గోదావరి మింగేసింది
కనకాయలంక (యలమంచిలి) : కనకాయలంక కాజ్‌వే వద్ద గోదావరిలోకి స్నానానికి దిగిన వారధి అప్పలరాజు(18) అనే యువకుడు ప్రమాదవశాత్తు బురదలో కూరుకుని మరణించాడు. స్థానికులు చెప్పిన కథనం ప్రకారం, తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరానికి చెందిన దాసరి ఆంజనేయులు కుటుంబం నెల రోజుల క్రితం కనకాయలంక వచ్చింది. కాజ్‌వే సమీపంలో గుడారం వేసుకుని వెదురు తట్టలు, చేటలు అమ్ముకుంటూ జీవిస్తున్నారు. ఈ క్రమంలో ఆంజనేయులు బావ.. తుని పట్టణం కుమ్మరి లోవకు చెందిన వారధి అప్పారావు, తన భార్య ముసలమ్మ, చిన్న కొడుకు అప్పలరాజుతో కలిసి బావమరిదిని చూసేందుకు గురువారం ఉదయం వచ్చాడు. ఈ క్రమంలో అప్పలరాజు ఆంజనేయులు కుమారుడు జాన్‌తో కలసి కాజ్‌వే వద్ద గోదావరిలోకి సాయంత్రం స్నానానికి దిగాడు. జాన్ ఎంత వారించినా వినక లోపలికి వెళ్లి నీట మునిగి చనిపోయాడు. జాన్ కూడా మునిగిపోయి అదృష్టవశాత్తు బయటపడ్డాడు. అప్పలరాజు తమను విడిచి ఒక్కరోజు కూడా ఉండేవాడు కాదని తల్లి ముసలమ్మ కన్నీటి పర్యంతమైంది. వీఆర్వో కె.శ్రీనివాసరావు పోలీసులకు సమాచారం అందించాడు. మృతదేహానికి శుక్రవారం శవ పంచనామా నిర్వహించి, పోస్టుమార్టంకు తరలించనున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా శ్రీరామ నవమి సందర్భంగా బుధవారం ఇదే ప్రాంతంలో వాడ్రేవుపల్లికి చెందిన ఐదుగురు యువకులు స్నానం చేస్తూ నీట ముగనడంతో స్థానికులు రక్షించినట్టు గ్రామస్తులు వివరించారు.