బుడిబుడి అడుగులు ఆగిపోయాయ్
బుడిబుడి అడుగులు ఆగిపోయాయ్
Published Tue, May 23 2017 12:40 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
దెందులూరు :
‘ఒరేయ్ డింపూ..
ఆడుకుంటానికెల్తన్నా..’
‘అన్నియ్యా.. నేనూ వత్తా..’
‘తొందరగా రారా..’
‘ఎక్కడికెల్దాం..’
‘అయిగో.. ఇసక దగ్గర్కి’
అనుకుంటూ ఆ చిట్టిపొట్టి అడుగులు ఇంటి సమీపంలోని ఇసుక గుట్టల వైపు నడిచాయి. కాసేపటి తరువాత అక్కడే ఉన్న చెరువు వైపు పరుగులు తీశాయి. రేవులోని మెట్లపై జారాయి. ఒకరినొకరు పట్టుకోబోతూ ఆ చిన్నారులిద్దరూ నీటిలో మునిగిపోయారు. కూతవేటు దూరంలో ఫిల్టర్ బెడ్ మరమ్మతులు చేస్తున్న కూలీలు ఆ దృశ్యాల్ని చూశారు. పరుగు పరుగున వచ్చి నీటమునిగిన చిన్నారులిద్దరినీ బయటకు తీశారు. అప్పటికే ఓ బుడతడి ప్రాణం గాలిలో కలిసిపోయింది. కొన ఊపిరితో ఉన్న మరో చిన్నారిని గ్రామంలోని వైద్యశాలకు తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందాడని వైద్యుడు నిర్థారించారు. దెందులూరులో
సోమవారం చోటుచేసుకున్న ఈ దుర్ఘటన అక్కా చెల్లెళ్లకు గర్భశోకం మిగల్చగా.. గ్రామస్తులను విషాదంలోకి నెట్టింది. దెందులూరులోని గౌడ వీధిలో ఆడుకునేందుకు వెళ్లిన మోర్ల గౌతమ్ (6), కొండేటి డింపు దుర్గాప్రసాద్ (4) సమీపంలోని మొటపర్తివారి కోనేరు చెరువులోకి జారి మృత్యువాత çపడిన ఘటన కలచివేసింది.
ఇంటి నిర్మాణంలో నిమగ్నం కాగా..
గౌడ వీధిలో నివశిస్తున్న ఐనాల శివరామకృష్ణ, వెంకట మహాలక్ష్మి దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వారి రెండో కుమార్తె మోర్ల సుజాత, అల్లుడు రాజు దెందులూరులోనే ఉంటున్నారు. వారికి గౌతమ్ (6), మరో పాప ఉన్నారు. మూడో కుమార్తె అరుణను ఏలూరుకు చెందిన కొండేటి కాసులుకు ఇచ్చి వివాహం చేయగా, వారికి డింపు దుర్గాప్రసాద్ (4), నాలుగు నెలల పాప ఉన్నారు. అరుణ ఐదు నెలల క్రితం కాన్పు కోసం పుట్టింటికి వచ్చి ఇక్కడే ఉంటోంది. ఇదిలావుంటే.. శివరామకృష్ణ తన ఇంటికి సమీపంలోనే రెండో కుమార్తె సుజాత కోసం పెంకుటిల్లు నిర్మిస్తున్నారు. కుటుంబ సభ్యులంతా ఆ పనుల్లో నిమగ్నమై ఉండగా.. చిన్నారులిద్దరూ సమీపంలోని ఇసుక గుట్టలపై ఆటలాడుతూ పక్కనే ఉన్న చెరువు వద్దకు వెళ్లారు. రేవులో మెట్లు దిగుతూ నీటిలో జారిపడ్డారు. అక్కడకు కొంతదూరంలో ఫిల్టర్ బెడ్ మరమ్మతులు చేస్తున్న కూలీలు ఈ ఘటనను చూసి పరుగెత్తుకు వచ్చారు. నీటమునిగిన చిన్నారులిద్దరినీ బయటకు తీయగా అప్పటికే గౌతమ్ మృతిచెందాడు. డింపు దుర్గాప్రసాద్ కొనఊపిరితో కొట్టుమిట్టాడుతుండటంతో గ్రామంలోని వైద్యశాలకు తరలించారు. అప్పటికే డింపు కూడా మృతిచెందినట్టు వైద్యులు నిర్థారించారు.
‘ఎంత పనిచేశావ్ దేవుడా..’
అక్కాచెల్లెళ్ల బిడ్డలైన గౌతమ్, దుర్గాప్రసాద్ మృతి వారిద్దరికీ గర్భశోకాన్ని మిగిలి్చంది. ఈ ఘటన గ్రామస్తులను కలచివేసింది. ఆడుకోవటానికి వెళ్లి విగత జీవులుగా మారిన చిన్నారులను చూసి గౌతమ్ తల్లి సుజాత, డింపు దుర్గాప్రసాద్ తల్లి అరుణ సొమ్మసిల్లి పడిపోయారు. తాత, అమ్మమ్మ శివరామకృష్ణ, వెంకట మహా లక్ష్మి, కుటుంబ సభ్యులు ‘ఎంత పనిచేశావ్’ దేవుడా అంటూ గుండెలవిసేలా రోదించారు. వారిని ఓదార్చటం ఎవరి తరం కాలేదు.
నాలుగు రోజుల్లో అత్తింటికెళ్దామనుకుంటుండగా..
పురుటి కోసం బిడ్డ దుర్గాప్రసాద్‌తో కలిసి పుట్టింటికి వచ్చిన అరుణను బాలింత పత్యం పూర్తి కావడంతో మరో నాలుగు రోజుల్లో ఏలూరులోని అత్తింటికి పంపించాలని ఆమె తల్లిదండ్రులు శివరామకృష్ణ, వెంకట మహాలక్ష్మి నిర్ణయించారు. అందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. చీర, సారెలతో బిడ్డ అరుణను, మనుమడు దుర్గాప్రసాద్, నాలుగు నెలల పసికందును ఘనంగా సాగనంపాలనుకున్నారు. ఈలోగానే మృత్యువు గౌతమ్, దుర్గాప్రసాద్ లను తీసుకెళ్లిపోయింది. కాన్పు సుఖంగా అయితే ద్వారకాతిరుమల వెళ్లి మొక్కు తీర్చుకోవాలని అరుణ, ఆమె భర్త కొండేటి కాసులు అనుకున్నారు. వారం రోజుల క్రితం తమ బిడ్డలిద్దరినీ తీసుకుని ఆ దంపతులు ద్వారకా తిరుమల వెళ్లి మొక్కు తీర్చుకున్నారు. త్వరలోనే ఏలూరులోని తమ ఇంటికి వెళదామనుకుంటుండగా ఈ దారుణం చోటుచేసుకుంది. బాధిత కుటుంబాలను వైఎస్సార్ సీపీ నాయకులు కట్టా వెంకట సుబ్బారావు, యేసుబాబు, గౌడ సంఘం పెద్దలు పరామర్శించారు. తహసీల్దార్ ఎస్.సత్యనారాయణ, సర్పంచ్ ఎన్.అజయ్, సొసైటీ అ«ధ్యక్షుడు కొడాలి శ్రీనివాస్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ టి.రాజు ఘటనా స్థలానికి చేరుకుని.. వివరాలు నమోదు చేసుకుని ఉన్నతాధికారులకు నివేదించారు.
Advertisement
Advertisement