దైవ దర్శనానికి వచ్చి అనంతలోకాలకు..
దైవ దర్శనానికి వచ్చి అనంతలోకాలకు..
Published Sun, Apr 16 2017 12:43 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
మొగల్తూరు మండలం పేరుపాలెం తీరంలో వేలాంకణి మాతను దర్శించేందుకు వచ్చిన ఇద్దరు సముద్రంలో స్నానానికి దిగి గల్లంతయ్యారు. వీరిలో ఒకరు మృత్యువాత పడగా, మరొకరి ఆచూకీ లభించలేదు. వీరిద్దరూ కృష్ణా జిల్లా నుంచి వేలాంకణి మాత దీక్షధారులతో కలిసి ఇక్కడకు వచ్చారు. అలాగే తాళ్లపూడి మండలం వేగేశ్వరపురంలో మేరీమాత మాల విరమణకు వచ్చిన దీక్షధారుడు గోదావరిలో స్నానానికి దిగి మృతిచెందాడు. తూర్పుగోదావరి జిల్లా వాడపల్లిలో వేంకటేశ్వర స్వామికి మొక్కు తీర్చుకునేందుకు వెళ్లి పదో తరగతి విద్యార్థిని దుర్మరణం పాలైన విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి.
మొగల్తూరు: మొగల్తూరు మండలం పేరుపాలెం తీరంలోని వేలాంకణి మాతను దర్శించుకునేందుకు వచ్చిన ఇద్దరు సముద్రంలో గల్లంతయ్యారు. కృష్టా జిల్లా చాట్రాయి మండలం తుమ్మగుంటకు చెందిన ములుగుమాటి వినోద్ (22) అనే యువకుడి మృతదేహం లభించగా, అదే జిల్లా చెక్కపల్లి మండలం ముసునూరి గ్రామానికి చెందిన దోమతోట విజయరాజు అనే వ్యక్తి ఆచూకీ తెలియరా లేదు. వివరాలిలా ఉన్నాయి.. చాట్రాయి మండలం తుమ్మగుంటకు చెందిన వినోద్ తల్లి సరోజిని, తండ్రి రాజు క్రైస్తవ దీక్షలు చేపట్టారు. దీక్ష విరమణకు సుమారు 50 మందితో లారీలో తుమ్మగుంట నుంచి శనివారం వేకువజామున 5 గంటల సమయంలో పేరుపాలెం బీచ్‌కు చేరుకున్నారు. ఉదయం సముద్రం పోటులో ఉండటంతో అలలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. తల్లితండ్రులతో కలిసి స్నానానికి దిగిన వినోద్ అలల ఉధృతికి గల్లంతయ్యాడు. నిమిషాల వ్యవధిలోనే విగత జీవిగా తీరానికి కొట్టుకువచ్చాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్సై వై.నాగేశ్వరరావు చెప్పారు.
వ్యక్తి గల్లంతు
కృష్టా జిల్లా ముసునూరి మండలం చెక్కపల్లి గ్రామానికి చెందిన దోమతోట విజయరాజు (35) సముద్ర స్నానానికి వచ్చి గల్లంతైనట్టు తెలిసింది. కూలి పనులు చేసుకునే విజయరాజు సహచర కూలీలతో పేరుపాలెం బీచ్‌కు వచ్చాడు. సహచరులు చూస్తుండగానే గల్లంతయ్యాడు. పోలీసుల కు సమాచారం అందించామని రాజు అనే వ్యక్తి తెలిపాడు. దీనిపై పోలీసులను వివరణ కోరగా తమకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు.
పోలీసులు విఫలం
ఏటా గుడ్‌ఫ్రైడే రోజు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వేలాది మంది తీరంలోని వేళాంకణీ మాతను దర్శించుకునేందుకు వస్తారు. అయినా పోలీసులు కేవలం 20 మంది సిబ్బందిని నియమించి చేతులు దులుపుకున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా బం దోబస్తు ఏర్పాటుచేయలేదనే విమర్శలు వస్తున్నాయి.
మొక్కు తీర్చుకునేందుకు వెళ్లి విద్యార్థిని..
ఇరగవరం : పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థిని మొక్కు తీర్చుకునేందుకు వెళ్లి గోదా వరిలో మునిగి మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి.. ఇరగవరం మండలం రేలంగి గ్రామ శివారు గవర్లపాలానికి చెందిన బుడ్డా వనమలరావు, నాగలక్ష్మి దంపతుల కుమార్తె వసంత (15) ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసింది. కుటుంబసభ్యులు, సన్నిహితులతో కలిసి శనివారం తూర్పుగోదావరి జిల్లా వాడపల్లిలోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లింది. ఆలయ సమీపంలోని గోదావరిలో స్నానం చేస్తుండగా గల్లంతయ్యింది. జాల ర్లు గాలించి వసంత మృతదేహాన్ని బయటకు తీశారు. వనమలరావుకు ఇద్దరు కుమార్తెలు కాగా వసంత చిన్నది. దైవ దర్శనానికి వెళ్లి అకాల మృతి చెందడంతో ఘటనా స్థలంలో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
Advertisement
Advertisement