యువకుడి దారుణ హత్య
యువకుడు అనుమానస్పద స్థితిలో మృతిచెందిన ఘటన పట్టణంలోని గుంటూరు రోడ్డులో గల జీబీసీ కాలువ సమీపంలోని పత్తి మిల్లుల వద్ద మంగళవారం వెలుగులోకి వచ్చింది.
సత్తెనపల్లి పారిశ్రామికవాడ వద్ద దారుణం
మృతుని శరీరంపై పలు చోట్ల గాయాలు
సత్తెనపల్లి: యువకుడు అనుమానస్పద స్థితిలో మృతిచెందిన ఘటన పట్టణంలోని గుంటూరు రోడ్డులో గల జీబీసీ కాలువ సమీపంలోని పత్తి మిల్లుల వద్ద మంగళవారం వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని సుమారు 35 ఏళ్ళ యువకుని మృతదేహం రోడ్డు పక్కగా పడి ఉండడం గమనించిన స్థానికులు మంగళవారం తెల్లవారుజామున పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహంపై నిక్కర్, బనియన్ మాత్రమే ఉన్నాయి. శరీరంపై కుడి చేతికి పలు చోట్ల గాయాలున్నాయి. అంతేగాక మృతదేహం పడి ఉన్న ప్రదేశానికి రెండడుగుల దూరంలో రక్తపు మరకలు, మరి కొంతదూరంలో దుప్పటి పడి ఉన్నాయి. పాతకక్ష్యల నేపథ్యంలో యువకుడిని ఎక్కడో హత్య చేసి మృతదేహాన్ని ఇక్కడ పడేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడో చంపి మృతదేహాన్ని ఇక్కడ పడేసి వెళ్లడమే తప్ప ఇక్కడ హతమార్చే పరిస్థితి ఉండదని స్థానికులు చెబుతున్నారు. గుంటూరు– మాచర్ల ప్రధానరహదారి ఎల్లవేళలా ఎంతో రద్దీగా ఉంటుంది. ఇక్కడ హత్య చేస్తే సులువుగా గమనించే అవకాశం ఉంటుంది. పోలీసులు కృష్ణా పుష్కరాల విధులలో తలమునకలుగా ఉండడంతో సుమారు 9 గంటల సమయంలో మృతదేహన్ని ఏరియా వైద్యశాలకు తరలించారు.
అవనిగడ్డవాసిగా గుర్తింపు..
అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన వ్యక్తి కృష్ణా జిల్లా అవనిగడ్డ ప్రాంతానికి చెందినవాడిగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మృతుని జేబులో ఉన్న నాలుగైదు ఫోన్ నెంబర్ల ఆధారంగా పోలీసులు వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. మృతుడు లారీ క్లీనర్‌గా పనిచేస్తుండవచ్చని, లారీ పైన నిద్రపోతుండగా అర్థరాత్రి సమయంలో జారిపడి ఉండవచ్చునని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా అలా లారీపై నుంచి పడి ఉంటే స్థానికులు, రాకపోకలు సాగించే వాహనదారులు గుర్తించే అవకాశం లేకపోలేదు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తేనే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది.