
సంఘటనాస్థలంలో అశోక్ మృతదేహం..(అంతర్ చిత్రం అశోక్ ఫైల్ ఫోటో)
గూడూరు: ఆ ఇంట్లో మరో పది రోజుల్లో వివాహ శుభకార్యం జరుగనుండగా కుటుంబసభ్యులు.. పెళ్లి బట్టలు, ఆహ్వాన పత్రికలు సిద్ధం చేసుకుని ఏర్పాట్లలో తలమునకలయ్యారు. పెళ్లితో ఓ ఇంటివాడు కాబోతున్న ఆ యువకుడిని చూసి తల్లిదండ్రులు మురిసిపోయారు. కానీ ఇంతలోనే విధి చిన్నచూపు చూసింది. కొద్ది రోజుల్లో పెళ్లి పీటలెక్కాల్సిన ఆ యువకుడు అనూహ్య రీతిలో హత్యకు గురికాగా కుటుంబసభ్యులు షాక్‌కు గురయ్యారు. పలువురినీ కంటతడి పెట్టించిన సంఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం భూపతిపేట శివారు గుంజేడు రహదారిలో శనివారం రాత్రి జరింది.
పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు కథనం ప్రకారం.. చిన్నఎల్లాపురం శివారు హాముతండాకు చెందిన జరుపుల పంతులునాయక్–పెంటి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు హరినాయక్‌కు పెళ్లి కాగా, చిన్న కొడుకు జరుపుల అశోక్ (29) తండాలో ఓ డబ్బాలో కిరాణ దుకాణాన్ని నడుపుతూ తల్లిదండ్రులకు బాసటగా ఉంటున్నాడు. ఇటీవల వీరి ఇంటి పక్కన గల ఓ వ్యక్తితో మధ్య ఇంటి స్థలాల గెట్టు పంచాయితీ మొదలైంది. ఈ క్రమంలో గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ జరుగుతుండగానే సదరు వ్యక్తి జరుపుల అశోక్, తండ్రి పంతులును చంపుతానని బెదిరించాడు. దీంతో భయపడిన అశోక్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు విచారణలో ఉంది.
ఇదిలా ఉండగా వారం రోజుల క్రితం అశోక్‌కు వివాహం నిశ్చయమైంది. ఈనెల 28న పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పెళ్లి బట్టలు తీసుకునేందుకు శనివారం అశోక్ తన కుటుంబ సభ్యులతో కలిసి నర్సంపేటకు వెళ్లారు. పెళ్లి పత్రికల ముద్రణ ఆలస్యమవడంతో అశోక్ ముందుగా తల్లిదండ్రులను ఇంటికి పంపించాడు. రాత్రి 8 గంటలకు పత్రికలు తయారు కాగా వాటిని తీసుకుని 9 గంటల సమయంలో నర్సంపేట నుంచి ఆటోలో బయలు దేరాడు. భూపతిపేట చెక్‌పోస్టు స్టేజీ వద్ద దిగిన అశోక్ తన సైకిల్ తీసుకుని ఇంటికి బయలుదేరినట్లు ఆటోడ్రైవర్ చెప్పినట్లు తల్లిదండ్రులు పేర్కొన్నారు.
తెల్లవారేసరికి దారి పక్కన శవమై..
ఆదివారం ఉదయం గ్రామ సమీపంలో ఓ వ్యవసాయ బావి వద్ద అశోక్ రక్తపు మడుగులో మృతిచెంది పడి ఉండడాన్ని స్థానికులు చూశారు. వెంటనే హాముతండా వాసులకు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన అక్కడకు చేరుకున్న తల్లిదండ్రులు పంతులు–పెంటి బోరున విలపించారు. స్థానికుల సమాచారంతో మానుకోట డీఎస్పీ నరేష్‌కుమార్, సీఐ రమేష్‌నాయక్, ఎస్సైలు యాసిన్, రామారావు సిబ్బంది అక్కడికి చేరుకుని హత్య జరిగిన తీరును పరిశీలించారు. ఇంటి స్థలం గెట్టు విషయంలో కక్ష కట్టి బోడ దేవుసింగ్ కుటుంబ సభ్యులే తన కొడుకును హత్య చేశారని మృతుడి తల్లిదండ్రులు పంతులు, పెంటి ఆరోపించారు.
విషయం తెలుసుకున్న పోలీసులు అనుమానితుడి ఇంటిని వెళ్లగా తాళం వేసి ఉంది. ఫోన్ నంబర్‌కు కాల్ చేయగా, రాత్రి వేములవాడ వెళ్లామని, తిరిగి వస్తున్నామని సమాధానం ఇవ్వడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ‘మరో పది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సినోడివి.. కక్ష గట్టి పాడె ఎక్కించారా’ అంటూ కుటుంబ సభ్యులు, బంధువులు చేసిన రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి. ఇదిలా ఉండగా తన తమ్ముడి మృతికి పక్కింటి బోడ దేవుసింగ్‌తో పాటు, వారి కుటుంబ సభ్యులే కారణమంటూ అశోక్ సోదరుడు హరినాయక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు దేవుసింగ్‌తోపాటు మరో నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.