ఏలూరు కాలువలో యువకుడి గల్లంతు
Published Thu, Aug 11 2016 1:22 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
తాడేపల్లిగూడెం రూరల్ : స్థానిక ఏలూరు కాలువలో బుధవారం మధ్యాహ్నం ఓ యువకుడు గల్లంతయ్యాడు. కడకట్లకుS చెందిన మారిశెట్టి గోవిందరావు (28) పట్టణానికి చెందిన ఓ ప్రముఖుని బంధువు మృతి చెందడంతో దహన కార్యక్రమాలకు వెళ్లాడు. యాగర్లపల్లి కొత్త బ్రిడ్జి ఇటుకల బట్టీ సమీపంలో ఆ కార్యక్రమాలన్నీ ముగించుకుని ఆ పక్కనే ఉన్న ఏలూరు కాలువలో స్నానం చేసేందుకు వెళ్లాడు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రమాదవశాత్తు కాలువలో పడి కొట్టుకుపోయాడు. దీంతో బంధువులు, మిత్రులు ఆచూకీ కోసం గాలింపు ప్రారంభించారు. ఇంకా ఆచూకీ కానరాలేదు. తాడేపల్లిగూడెం అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. గోవిందరావు వెల్డింగ్ పనిచేస్తూ కడకట్లలో నివాసముంటున్నాడు. తల్లి మృతి చెందగా.. తండ్రి ఒడిశాలో వెల్డింగ్ పనిచేస్తుంటాడు. మృతునికి ఇద్దరు అక్కలు. వీరిద్దరికీ వివాహాలయ్యాయి. ఇదిలా ఉంటే ఘటనా స్థలాన్ని తహసీల్దార్ పాశం నాగమణి సందర్శించారు. చీకటి పడటంతో గాలింపును ఆపేశారు. తిరిగి గురువారం ఉదయం గాలింపు చేపట్టనున్నట్టు తహసీల్దార్ తెలిపారు. గజ ఈతగాళ్లను కూడా రప్పించాలని ఫైర్ సిబ్బందిని ఆదేశించారు.
పెళ్లి చేద్దామనుకుంటుండగానే ఇలా..
గోవిందరావుకు వివాహం కాలేదు. తండ్రి వేరే రాష్ట్రంలో పనిచేస్తుంటాడు. తాడేపల్లిగూడెం కడకట్ల ప్రాంతంలో గోవిందరావు ఒంటరిగా ఉంటున్నాడు. దీంతో అతనికి పెళ్లి చేయాలని బంధువులు నిశ్చయించారు. ఈ నేపథ్యంలోనే బుధవారం అతని మావయ్య పోలయ్య తదితరులు పెళ్ళిసంబంధాల గురించి మాట్లాడుతుండగానే ఈ ఘటన జరగడం వారిని హతాశులను చేసింది. పడాల అయ్యప్పస్వామి గుడి రేవులో అల్లుడి కోసం పోలయ్య ఆశగా ఎదురు చూడటం పలువురిని కంటతడి పెట్టించింది.
పన్నెండు రోజుల వ్యవధిలో ఇద్దరు!
ఏలూరు కాలువలో పన్నెండు రోజుల వ్యవధిలో ఇద్దరు గల్లంతయ్యారు. గత నెల 29న ఇంజనీరింగ్ విద్యార్థి మాకా ఫణికుమార్ ఈతకు వెళ్లి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. మరుసటి రోజు ఉదయం అతని మృతదేహం యాగర్లపల్లి బ్రిడ్జి సమీపంలో లభ్యమైంది. ఆ ఘటన మరువక ముందే గోవిందరావు గల్లంతు కావడం స్థానికులతోపాటు పట్టణ వాసులను కలవరపరుస్తోంది. కాలువ వెంబడి ఉన్న రేవుల్లో ఎటువంటి భద్రతా ఏర్పాట్లు లేకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఎగువ నుంచి భారీగా వరద నీరు గోదావరికి చేరడంతో ఆ నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇది కూడా ప్రమాదానికి కారణంగా కనిపిస్తోంది.
Advertisement
Advertisement