యువదళం.. సేవా కెరటం
యువదళం.. సేవా కెరటం
Published Sat, Aug 20 2016 12:10 AM | Last Updated on Mon, Sep 4 2017 9:58 AM
– భక్తుల సేవలో ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు
– శ్రీశైలంలో దాదాపు 600 మంది వలంటీర్ల సేవలు
– సేవలతో భక్తులు, అధికారుల మెప్పు పొందుతున్న వైనం
ఊరుకాని ఊరు వచ్చిన వారికి ఓ చిన్న మంచి మాట.. కాస్తంత సాయం.. ఎంతో తృప్తిని కలిగిస్తాయి. అలాంటి సాయానికి తాము సదా సిద్ధమని జాతీయ సేవా పథక(ఎన్‌ఎస్‌ఎస్) వలంటీర్లు ముందుకొచ్చారు. గొంతెండిన వారికి దప్పిక తీర్చుతూ.. దారి తెలియని వారికి దారి చూపుతూ.. నడవలేని వారికి సాయం చేస్తూ.. దూరప్రాంతాల నుంచి వస్తున్న వారికి మేమున్నామనే భరోసా కల్పిస్తున్నారు. పుణ్య స్నానం చేయడానికి వచ్చిన భక్తుల సేవలో తరించి ప్రజల మెప్పు పొందుతున్నారు. కష్ణా పుష్కరాలకు తరలివచ్చే భక్తులకు సేవ చేసేందుకు పాతాళగంగ, లింగాలగట్టు స్నాపు ఘాట్ల వద్ద దాదాపు 600 మంది వలంటీర్లు పనిచేస్తున్నారు. వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, చిన్నారులు వలంటీర్ల సాయంతో సాఫీగా పుణ్యస్నానాలు చేస్తున్నారు. వలంటీర్ల సేవలతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగడం లేదు. అధికారులకు తోడుగా వలంటీర్ల సేవలతో భక్తులకు పుణ్య స్నానాలు చేయడం సులభంగా ఉంది. శ్రీశైలంలో కర్నూలులోని ఫర్‌మెన్, కర్నూలు డిగ్రీ కాలేజ్‌లతోపాటు ఇండియర్ రెడ్‌క్రాస్ సొసైటీ, సున్నిపెంట డిగ్రీకళాశాల వలంటీర్లు భక్తులకు సేవలు అందిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలాంటి అలుపు సొలుపులేకుండా విధులు నిర్వహిస్తున్నారు.
– శ్రీశైలం (కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు)
సేవ చేయడంటే ఇష్టం: లోకేష్‌కుమార్, డిగ్రీ థర్డ్ ఇయర్, చిత్తూరు.
మాది చిత్తూరు జిల్లా. అక్కడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో థర్డ్ ఇయర్ చదువుతున్నాను. సేవ చేయడమంటే ఇష్టం. అందుకోసమే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో వలంటీరుగా చేరాను. ఇప్పటికే చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నాను. పుష్కర భక్తులకు సేవ చేయడం సంతోషంగా ఉంది.
దేశ సేవకు ఎప్పుడు ముందుంటాను: ప్రవీణ్‌కుమార్, డిగ్రీ ఫస్టియర్, ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల, కర్నూలు
దేశ సేవ చేసేందుకే ఎన్‌ఎస్‌ఎస్‌లో చేరాను. శ్రీశైలానికి కృష్ణాపుష్కర భక్తులకు సేవచేయడానికి అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. మా సేవలను భక్తులు గుర్తిస్తే సంతోషిస్తా.
వద్ధులకు స్నానం చేయిస్తుంటే ఆనందంగా ఉంది: గాయత్రీ, బీకామ్, ఫస్టియర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సున్నిపెంట
వృద్ధులు, మహిళలకు పుష్కర స్నానం చేయించే అవకాశం రావడం ఆనందంగా ఉంది. కొంతమంది కోపించుకున్నా ఆనందంగా వారిని ఘాట్ దగ్గరకు తీసుకెళ్లి స్నానం చేయిస్తున్నాం. అధికారులు మా సేవలను గుర్తించి ప్రశంసిస్తుంటే నాలో సామాజిక బాధ్యత ఇంకా పెరిగింది.
Advertisement