రేసుగుర్రం గాడిదైందా..?
♦ నీతులు చెప్పడం కాదు ఆచరించాలి
♦ కార్యకర్తలను, నాయకులను ఫోన్ చేసి బెదిరిస్తే ఊరుకోనే ప్రసక్తేలేదు
♦ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి
జమ్మలమడుగు:2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున నామినేషన్ వేసిన ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి బహిరంగసభలో మాట్లాడుతూ తాను రేసుగుర్రానని, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి కంచర గాడిదని చెప్పారని, ప్రస్తుతం ఆ రేసుగుర్రం పార్టీ ఫిరాయించి కంచర గాడిదగా మారిందని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం పట్టణంలో 200 కుటుంబాలు ఆయన సమక్షంలో పార్టీలో చేరాయి. అనంతరం స్థానిక చిక్కాల మురళీ ఇంట్లో సమన్వయకర్త సుధీర్‌రెడ్డితో కలసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. పట్టణంలో చాలామంది ఎమ్మెల్యే వర్గం నుంచి విడిపోయి వైఎస్సార్‌సీపీలో కొనసాగుతున్న వారిని సూర్యం, ఎమ్మెల్యేలు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పైకి మాత్రం ‘ఫ్యాక్షన్ వద్దు ఫ్యాషన్ ముద్దు’అంటూ చేతల్లో మాత్రం మరొకటి చేస్తున్నారని మండిపడ్డారు. నైతిక విలువలు గల వ్యక్తినంటూ గొప్పలు చెప్పుకునే ఎమ్మెల్యే పార్టీ మారి వందరోజులైనా ఇంతవరకు ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు.
విలువల్లేని నాయకులు కాకుండా నిరాడంబరులైనా వారిని రాజకీయాల్లో తీసుకురావాలనే ఉద్దేశంతో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డాక్టర్‌గా ఉన్న సుధీర్‌రెడ్డికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఫ్యాక్షన్ రాజకీయాలు కాకుండా స్వచ్ఛమైన రాజకీయాలు ఉండాలని లక్ష్యంతోనే సుధీర్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించారన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్న ఇంతవరకు ఇచ్చిన హామీలను అమలుచేయడంలో ఘోరంగా విఫలమయ్యారన్నారు. అదే విషయాన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయని, ప్రజలే బహిరంగంగా విమర్శిస్తున్నారని తెలిపారు. బాబు మాఫీ మాయజాలంతో మహిళలు, రైతులు రోడ్డున పడ్డారన్నారు. బ్యాంకర్లు ఇళ్ల వద్దకు వచ్చి ఆస్తులు జప్తు చేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారని మహిళలు వాపోతున్నారన్నారు.
నిరుద్యోగ భృతిని ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పదేళ్ల పాటు అధికారం కోల్పోయి బాధలు పడ్డారు. అధికారం రాగానే తాము కూడా బాగుపడుతామని భావించారన్నారు. అయితే పందికొక్కుల్లా ఇంట్లో దూరి వారి నోట్లోనే మన్ను కొట్టారన్నారు. ఇలాంటి పందికొక్కులాంటి నాయకులు ఉంటే టీడీపీకే తీరని నష్టమన్నారు. నాడు ఎద్దుల ఈశ్వరరెడ్డి నడుచుకుంటూ గ్రామాలకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ రాజకీయాలు చేశారని గుర్తుచేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఎసీ కారుల్లో తిరుగుతున్నారని తెలిపారు. ఫ్యాక్షన్ వద్దు ఫ్యాషన్ ముద్దు అనే ఎమ్మెల్యే ముందుగా తాను ప్రజల్లో కలిసిపోయి ప్రజాసేవ చేసినప్పుడే ఫ్యాక్షన్ దూరమై ఫ్యాషన్ వస్తుందన్నారు. ఎమ్మెల్యేనే ఫ్యాక్షన్‌ను ప్రోత్సహించే విధంగా కార్యకర్తలపై, నాయకులపై బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులకు తాము ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి దొడ్లవాగు శంకర్‌రెడ్డి, హనుమంతరెడ్డి, సుద్దపల్లె శివుడు, పట్టణ ఇన్‌చార్జీ పోరెడ్డి మహేశ్వరరెడ్డిలు పాల్గొన్నారు.