
'సింగపూర్‌లో బాబు ఇల్లు కట్టుకున్నాడట'
శ్రీకాకుళం: ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం, రుణమాఫీ వంటి హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి తీరును యువత ఎండగట్టింది. శ్రీకాకుళం టౌన్ హాల్లో మంగళవారం యువభేరీ సదస్సులో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో విద్యార్థులు.. చంద్రబాబు ప్రభుత్వం పనితీరును, మోసపూరిత వాగ్దానాలపై గళమెత్తారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు జగన్ సమాధానమిచ్చారు. చంద్రబాబు సర్కార్ను విద్యార్థులే బంగాళాఖాతలో కలుపుతారని వైఎస్ జగన్ అన్నారు. యువభేరీలో విద్యార్థుల ప్రశ్నలకు జగన్ సమాధానాలు...
యోగి, విద్యార్థి: బాబు వస్తే జాబు వస్తుందని ఊదరగొట్టిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మరచిపోయారు. ప్రత్యేక హోదా విషయాన్ని కూడా మరచిపోయారు. ఆంధ్రప్రదేశ్ను అప్పులపాలు చేసి చంద్రబాబు సింగపూర్కు వెళ్లిపోరని గ్యారెంటీ ఏమిటి?
జగన్: చంద్రబాబు సింగపూర్కు పోతాడని నాకూ సందేహంగా ఉంది. సింగపూర్లో బాబు ఇల్లు కట్టుకున్నాడని ఈ మధ్యే ఎవరో చెప్పారు.
హిమలక్ష్మి, ఎంకామ్: చంద్రబాబు స్మార్ట్ సిటీలు అంటున్నారు. ఆ మాట పక్కన పెడితే కనీసం విద్యార్థుల్లో ఉన్న స్మార్ట్‌నెస్‌ను గుర్తించే ప్రయత్నం అయినా చేయాలి. ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అయినా కనీసం కాలేజీలు, యూనివర్సిటీల్లో సౌకర్యాల గురించి పట్టించుకోలేదు. విద్యార్థులకు నాణ్యమైన విద్య కావాలి. చంద్రబాబు నాయుడు విఫలమయ్యారు. మీరు అండగా ఉండి పోరాడాలి.
జగన్: ఈ విషయమై చంద్రబాబును నిలదీద్దాం. అందరం కలసి పోరాడుతాం.
దేవి, డిగ్రీ ఫైనలియర్: రుణమాఫీ చేస్తామని చెయ్యలేదు. దీనివల్ల సమస్యలు ఎదుర్కొంటున్నాం. డ్వాక్రా రుణం తీసుకున్న మా అమ్మ చాలా కష్టపడుతోంది.
జగన్: నీ మాటలు ఇప్పటికైనా చంద్రబాబుకు అర్థమవుతాయి. జ్ఞానోదయం అవుతుందని ఆశిస్తున్నా. ఈ విషయంపై పోరాడుతాం.
సౌజన్య, బీడీఎస్ విద్యార్థిని: మేకిన్ ఇండియా అంటున్నారు. అమరావతి నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యం ఎందుకు? ఏపీలో ఇంజనీర్లు లేరా?
జగన్: మీరడిగిన ప్రశ్నలతో బాబుకు జ్ఞానోదయం కావాలి. మన దేశంలో ఎందరో గొప్ప ఇంజనీర్లు ఉన్నారు. భూములను అడ్డగోలుగా కంపెనీలకు ఇస్తున్నారు.
గాయత్రి: ఎన్నికలకు ముందు ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక మరిచిపోయారు. జగనన్నా.. ఇలాంటి వ్యక్తికి నైతికంగా పాలించే అర్హత ఉందా?
జగన్: చంద్రబాబు ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు. లేకుంటే ఇంటికి రెండు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని నిలదీస్తున్నారు. మీ మాట నిజమే తల్లీ. ఇది నిజంగా సిగ్గుపడాల్సిన పరిస్థితి. చంద్రబాబుకు పాలించే నైతిక హక్కులేదు. ఆయన రాజీనామా చేయాలి.
సాయి సందీప్, ఇంజనీరింగ్ విద్యార్థి: ఎన్నికల సమయంలో ఉద్యోగాలిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లయినా నోటిఫికేషన్ రాలేదు.
జగన్: రాష్ట్ర విభజన నాటికి ఏపీలో 1.42 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అయినా చంద్రబాబు ఆ ఖాళీలను భర్తీ చేయకుండా దారుణంగా వ్యవహరిస్తున్నాడు. ప్రత్యేక హోదా అన్నది మరచిపోలేని విషయం. ప్రభుత్వాలపై గట్టిగా ఒత్తిడి తీసుకువస్తాం.