అసైన్డ్ భూములంటే..అత్తగారి భూములా?
మచిలీపట్నం: ఏ ప్రభుత్వం అయినా భూములను బలవంతంగా తీసుకోవటం దారుణమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ప్రజలకు ఇష్టం ఉంటేనే వారి వద్ద నుంచి భూములు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. మచిలీపట్నం పర్యటనలో ఉన్న వైఎస్ జగన్ బుధవారం తుమ్మలపాలెం రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల వద్ద నుంచి బలవంతంగా భూములు తీసుకుని ప్రైవేటు వాళ్లకు ఇచ్చేయడానికి ప్రయత్నం జరుగుతోందన్నారు.
భూములు ఇచ్చేందుకు ప్రజలకు ఇష్టం లేకున్నా ఎందుకు బలవంతం చేస్తున్నారని వైఎస్ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ముందు ప్రజల వద్దకు రావాలని, వాళ్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటేనే తీసుకోవాలన్నారు. అంతేకానీ బలవంతంగా లాక్కోవడం చాలా అన్యాయమన్నారు. ప్రభుత్వం ఎప్పటికీ ప్రజలకు శ్రీరామరక్షగా ఉండాలని...ముఖ్యమంత్రి అంటే మా ముఖ్యమంత్రి అనుకునేలా ఉండాలి. కానీ ఇక్కడ మాత్రం అందుకు వ్యతిరేకంగా ఉందని వైఎస్ జగన్ అన్నారు.
చంద్రబాబు సర్కార్పై గట్టిగా ఒత్తిడి తెస్తామని, అసైన్డ్ భూములంటే అత్తగారి భూములనుకుంటున్నారా అని ఆయన ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక చట్టాలను మార్చుతామని ఆయన తెలిపారు. భూములు ఇచ్చేస్తే ప్రజలు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. పేదల భూములు లాక్కునే హక్కు ఎవరిచ్చారన్నారు. పరిశ్రమల పేరుతో జరుగుతున్న దోపిడీని ఆపాలని ఆయన అన్నారు. ఖర్మకాలి చంద్రబాబు సీఎం అయిన తర్వాత కృష్ణా డెల్టాకు కూడా కరువు వచ్చిందని వ్యాఖ్యానించారు.
రైతుల ఆవేదన..
రెండు పంటలు పండే భూములు వదులుకోం
పారిశ్రామికవేత్తలకు భూములు ఇచ్చేది లేదు
భూములు లాక్కుపోతే మాకు దిక్కేంటి?
బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తున్నాం
అనుబంధ పరిశ్రమల పేరుతో భూముల పంపకం
బ్యాంకులు లోన్లు ఇవ్వడం లేదు