గన్నవరంలో వైఎస్ జగన్కు ఘన స్వాగతం
విజయవాడ: మచిలీపట్నం పర్యటనలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఉదయం గన్నవరం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. కాగా బందరులో భూసేకరణ బాధిత రైతులతో వైఎస్ జగన్ భేటీ కానున్నారు. ముందుగా ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన మచిలీపట్నం మండలంలోని కరగ్రహారానికి చేరుకుంటారు.
ఫరీద్‌బాబా దర్గా సెంటర్ వద్ద రైతులతో, గ్రామస్తులతో వైఎస్ జగన్ మాట్లాడనున్నారు. అక్కడి నుంచి తుమ్మలచెరువు చేరుకొని వినాయకుడి గుడి సెంటర్‌లో రైతులతో భేటీ అవుతారు. అనంతరం పొట్లపాలెం చేరుకొని పంచాయతీ కార్యాలయం సెంటర్‌లో రైతులతో సమావేశం కానున్నారు. అక్కడి నుంచి తిరుగు పయనమై గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాదుకు వెళతారు.