
పరిశీలన అంటే అధికారులను తిట్టడం కాదు: వైఎస్ జగన్
భారీవర్షాల తాకిడికి అతలాకుతలమైన వైఎస్ఆర్ జిల్లా రైల్వేకోడూరు ప్రాంతంలో వైఎస్ఆర్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం సాయంత్రం పర్యటించారు. గుంజనా నది వరదలతో ప్రభావితమైన ప్రాంతాలను ఆయన పరిశీలించారు.
27 రోజులుగా వర్షబీభత్సంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా.. ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి సాయం అందడం లేదని ఆయన మండిపడ్డారు. తక్షణమే ఇంటికి 25 కిలోల చొప్పున బియ్యం, నగదు అందించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. వర్ష ప్రభావిత ప్రాంతాల పరిశీలన అంటే అధికారులను తిట్టడం కాదని.. నిధులిచ్చి అధికారులను పనిచేయమని చెబితే వారు చేస్తారని ఆయన చెప్పారు.
''బాధితులకు ఇవ్వాల్సిన డబ్బులు, బియ్యం, వనరులు ఇచ్చి.. ఆ తర్వాత అధికారులను ఏమైనా అంటే బాగుంటుంది. కానీ ప్రజలు ముఖ్యమంత్రిని తిట్టకముందే ఆయనే అధికారులను తిడుతున్నారు. ఎంతమందికి మేలు జరిగిందో ప్రజలనే అడిగి తెలుసుకోండి. పనులకు పోలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి 3, 4 వేల రూపాయల డబ్బులు, 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, చక్కెర ఇస్తేనే బతకగలరు. అవేవీ ఇవ్వకుండా అధికారులను తిట్టడం మానవత్వం ఉన్న పని కాదు. ప్రతి గ్రామంలో ప్రజలు తండోపతండాలుగా వచ్చి, తమకేమీ జరగట్లేదని.. బతకడం కూడా కష్టంగా ఉందని చెబుతున్నారు'' అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.